కేంద్రంలోని మోదీ సర్కార్ ఆదాయపు పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పలు రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబుర్లు చెప్పింది. ముఖ్యంగా వేతన జీవులకు భారీ ఊరట కలిగించే శుభవార్తను ప్రకటించింది. రూ.0-4 లక్షలు వరకూ ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు. రూ.5.4-8 లక్షల వరకు 5 శాతం, రూ.5.8-12 లక్షల వరకూ 10 శాతం పన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మునుపటితో పోలిస్తే ఈసారి భారీగానే పన్ను మినహాయింపులు ప్రకటించడం సామాన్యుడు మొదలుకుని మిడిల్ క్లాస్ ఉద్యోగి వరకూ ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు.
ఎన్ని లక్షలకు ఎంత..?
రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.16లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25%, రూ. 24 లక్షల పైన ఎంతున్నా 30 శాతం పన్ను ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు పార్లమెంటు వేదికగా నిర్మలమ్మ ప్రకటించారు. దీంతో ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా కానుంది. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి సుమారు లక్షా 10 వేలు ఆదా కానుంది.
మొత్తం ఎంత. ?
కాగా 2024-25లో మొత్తం రాబడి రూ.31.47 లక్షల కోట్లు కాగా.. 2024-25లో మొత్తం ఖర్చు రూ.47.16 లక్షల కోట్లు అని కేంద్రం ప్రకటన చేసింది. 2024-25లో ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీ 4.8 శాతం, 2025-26లో మొత్తం ఖర్చు అంచనా రూ.50.65 లక్షల కోట్లు అని నిర్మలమ్మ వెల్లడించారు. 2025-26లో మొత్తం రాబడి అంచనా రూ.34.96 లక్షల కోట్లు అని, లోటు జీడీపీలో 4.4 శాతం కాగా.. అప్పు చేయాల్సిన మొత్తం రూ.11.4 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బిహార్‌కు కేంద్రం వరాల జల్లు
కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కు భారీగా కేంద్రం కేటాయింపులు ఇచ్చింది. బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్, నగరాలకు గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు నిధులు, రూ.25 వేల కోట్లతో మేరీటైమ్ అభివృద్ధి ఫండ్ ఇస్తున్నట్టు కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాగా ఈ ఏడాది చివరిలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామి కూడా. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ పట్టుబట్టి కూర్చోగా.. సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది.