తెలంగాణ రాజకీయాల్లో ఊహించని కుదుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. పనులు కాకపోవడంపై ఎమ్మెల్యేలు గత కొన్నిరోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే 40 శాతం వాటాలు, 14 శాతం కమీషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల వేధింపులు భరించలేక ఎమ్మెల్యేలు ఇలా రహస్య సమావేశం అయినట్లు సమాచారం. మొత్తమ్మీద ముఖ్యమంత్రి, రెవెన్యూ, ఆర్థిక మంత్రులే టార్గెట్ అంటూ ఈ సమావేశం జరిగింది. మరోవైపు సమావేశానికి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా వర్గాలతో డేగ కన్ను వేసింది.
పొంగులేటి దెబ్బతోనే..!
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నారు. రెండురోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి విషయం చెప్పినా పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తిగానే ఉన్నారు. భేటీ అయిన ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. భేటీ అయిన ఎమ్మెల్యేల్లో నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్,దొంతి మాధవ్, బీర్ల ఐలయ్య ఉన్నారు.
అటు మీటింగ్.. ఇటు అత్యవసర భేటీ!
అటు ఎమ్మెల్యే రహస్య సమావేశంతో ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొన్నం, తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు.
పార్టీ, ప్రభుత్వంలో సమన్వయం కోసం అందరూ కలిసి పనిచేయాలని, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య.. అంతరాలు లేకుండా చూడాలని రేవంత్ ఆదేశించారు. కాగా పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరీ మంత్రి పొంగులేటి సీఎం సమావేశానికి హాజరయ్యారు. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం ఆందోళన చెందుతోంది.