శ్రీలీల కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఆమె ఇప్పుడు కాల్షీట్ల సమస్య కారణంగా ఇబ్బంది పడుతోంది. నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉండగా.. అందులో రెండు సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్. మరో శ్రీదేవి అవుతుందని అంతా ఊహించారు. కానీ శ్రీలీలకు వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అవకాశాలు తగ్గాయి. పుష్ప 2లో ఐటెమ్ సాంగ్ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఇదివరకటి స్పీడులోనే సినిమాలు ఒప్పుకుంటోంది. పారితోషికం కూడా పెంచుకుంటోంది.
అయితే శ్రీలీల చేస్తున్న తప్పేంటంటే కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడకుండా అడ్వాన్సులు తీసుకుంటోంది. దాంతో డేట్ల విషయంలో క్లాష్ వస్తోంది. శ్రీలీల కోసం సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా జారిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ కావాలనుకోవడం పారితోషికం కోసం సినిమాలు ఒప్పేసుకోవడం వల్లే ఈ సమస్య. ఇలాగైతే నిర్మాతలు ఇబ్బందుల్లో పడతారు. ఈ విషయాన్ని శ్రీలీల గమనిస్తే మంచిది.
రవితేజ మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్. అయితే ఇప్పుడు శ్రీలీల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు 12 రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చింది. మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ శ్రీలీల ఓ తమిళ సినిమాకు బల్క్ గా డేట్లు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్ లో ఇస్తానని అంటోందట. దాంతో శ్రీలీలను పక్కన పెట్టి మరో హీరోయిన్ ను తీసుకుందామా.. అనే ఆలోచన చేస్తోంది చిత్రబృందం.
అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. హీరోయిన్ ను పక్కన పెడితే అవన్నీ మళ్లీ రీషూట్లు చేయాలి. ఆగితే పోతుందిలే అనేలా టీమ్ ఆలోచనలో పడిందని సమాచారం. మరోవైపు అఖిల్ సినిమాలోనూ హీరోయిన్‌గా శ్రీలీలను ఎంచుకున్నారు. కానీ అక్కడ కూడా కాల్షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాళ్లు కూడా మరో ఆప్షన్ వెదుకుతున్నట్టు తెలుస్తోంది.