మీడియాపై ఓవరాక్షన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. జయరాంకు ఫోన్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాకే బెదిరింపులా..? ఇదేం పద్ధతి..? ఇంకోసారి ఇలాంటివి రిపీట్ ఐతే బాగోదని గట్టిగానే హెచ్చరించారు. పాత్రికేయులను బెదిరించటం టీడీపీ సంస్కృతి కాదని క్లాస్ తీసుకున్నారు. ఐతే మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటానని అధిష్టానానికి జయరాం హామీ ఇచ్చారు. దీంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.
ఇంతకీ ఏం జరిగింది..?
బుధవారం నాడు గుంతకల్లు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా గురుంచి ఇష్టానుసారం మాట్లాడి నోరు పారేసుకున్నారు. మీడియా అంటే నాకు లెక్కలేదు. నేను అన్ని చేసి వచ్చినోడినే. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. రాసుకోండి ఏం రాసుకుంటారో. నేను తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తాను. నాపై వివాదాలు రాస్తే మాత్రం రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతాను అని జయరాం మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.
బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి!
కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు.. నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు. భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు వీటన్నింటినీ నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతాను.. ఒకటి రెండు ఛానల్స్ తప్ప అందరూ నా మిత్రులే. నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుని నాపై వార్తలు రాయాలి అని జయరాం మీడియాకు వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగి.. కాసింత క్లాస్, మరికొంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది.