Advertisement
Google Ads BL

పవన్ పంజా ప్రతీకారమా.. పరిపాలనా..


ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఊహించని రీతిలో వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. అదికూడా మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీకి సైతం ఇసుమంత కూడా అంతు చిక్కడం లేదు. పవన్ పంజాతో వైసీపీ నేతలు, క్యాడర్ ఆఖరికి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం గిల గిల కొట్టుకుంటున్న పరిస్థితి. దీంతో ఇది పవన్ ప్రతీకారమా? లేదా పరిపాలనా..? అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ఒకింత తలలు పట్టుకుంటున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా.. ఎందుకు.. ఏమిటీ? అనే ఊహించని ఇంట్రెస్టింగ్ విషయాలు సినీజోష్ సంచలన కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..

Advertisement
CJ Advs

ఎలా అర్థం చేసుకోవచ్చు..?

పవన్‌ కల్యాణ్‌కు ఈ మధ్య రాజకీయాలు బాగానే ఒంటబట్టినట్టే అని కొన్ని సందర్భాలు, మరికొన్ని నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయి. సరైనోడికి అధికారం దక్కితే ఆ కిక్కు, పరిపాలించే తీరే వేరుగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సరిగ్గా పవన్ కళ్యాణ్ కూడా అదే చేసి చూపిస్తున్నారు. కొందరు మాటలకు చేతలకు సంబంధమే లేకుండా హడావుడి చేస్తుంటారు. ఇంకొందరు సైలెంటుగానే పని కానిచ్చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రెండూ కాకుండా పరిపాలనలో భాగంగానే తీర్చుకోవాల్సిన ప్రతీకారం మొత్తం తీర్చుకుంటున్నారనే మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. యువగళం పాదయాత్రలో మొదలుపెట్టిన నారా లోకేష్ రెడ్ బుక్ హడావుడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఐతే పవన్ కళ్యాణ్ మాత్రం అదిగో అది చేస్తాం.. వాళ్ళను ఇలా చేస్తాం.. అలా చేస్తాం అని ఎక్కడా చెప్పుకోలేదు. అందరి మీద ఒక కన్నేసి ఉంచి ఎవరిని ఎక్కడ తొక్కిపెట్టాలో తొక్కుతూ.. మరోవైపు ఎక్కడ నొక్కాలో నొక్కి తాట తీసి పడేస్తున్నారు సేనాని. ఒక్కమాటలో చెప్పాలంటే లోకేష్ అరుపులు మాత్రమే.. పవన్ కళ్యాణ్ మెరుపులు, అంతకు మించి ప్రత్యర్థులకు చుక్కలే చూపిస్తున్నారు.

ఒక్కొక్కరిని ఏరి పడేస్తున్నారుగా!

వైసీపీ అధికారంలో ఉండగా ఎవరెవరు ఐతే టార్గెట్ పవన్ కళ్యాణ్, జనసేనగా తోకలు తిప్పి నానా యాగీ చేశారో ఆ నేతల్లో ఒక్కొక్కరిని పవన్ ఏరి పడేస్తున్నారు. అది కూడా ఒక పద్ధతి, విధానం పాటిస్తూనే పని కానిచ్చేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. పవన్‌పై చీటికి మాటికి ఒంటికాలిపై లేస్తూ వచ్చేవారు. సీన్ కట్ చేస్తే ఆయన్ను ఓడించి, అక్రమ సామ్రాజ్యాన్ని, మూడో కంటికి తెలియకుండా చేస్తున్న వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడ కట్ చేసి.. అక్రమ ద్వారాలకు తాళం వేసేసారు పవన్. అటు కాకినాడ పోర్టుకు వెళ్లి సీజ్ ద షిప్ దెబ్బతో అక్రమ రేషన్ మాఫియా మాటున ఉన్న ద్వారంపూడితో పాటు టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేల కూసాలు సైతం కదిలిపోయే చేశారు. ఇక ఇదే క్రమంలో పోర్టు వాటాలు బలవంతంగా రాపించుకున్నారనే కేవీ రావు ఫిర్యాదుతో వైసీపీలో నంబర్ 2గా, వైఎస్ జగన్ ఆత్మగా, నీడగా అంతకు మించి ఉన్న విజయసాయిరెడ్డిని రాజీనామా చేసే స్థితికే కాదు రాజకీయాలకే స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకునే పరిస్థితికి తెచ్చారు పవన్.

జగన్ రెడ్డితో మొదలు.. నేతల వరకూ!

ఇక సరస్వతి భూముల విషయంలో వైఎస్ జగన్ రెడ్డి సైతం దెబ్బకు వణికిపోయేలా చేసింది సేనానినే. ఆ లెక్కలు ఇప్పటికే కొన్ని తేలగా పూర్తిగా తేల్చే పనిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏ క్షణమైనా పెద్ద భూ బాంబ్ పేలినా పేలొచ్చు. సెటైర్లు, తీవ్ర విమర్శలు, కౌంటర్లతో విర్రవీగిన పేర్ని నాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరూ చూసున్నారు. ఒకప్పుడు రోజుకొకసారి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడే నాని ఇప్పుడు గోదాములో బియ్యం మాయం కావడంతో ఆయన కూడా కనుమరుగు అయిన పరిస్థితి. గోదావరి జిల్లాల్లో వైసీపీకి వెన్నెముకగా, కాపు కాసిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ ఇప్పుడు క్రియాశీలకంగా లేకుండా పోయారు. ఇందులో దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, వంగా గీత ఐతే మీడియా ముందుకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇక సేనానిపై గతంలో పోటీ చేసి గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఐతే వైసీపీకి రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. ఇక గాజువాక నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఏమయ్యారనేది ఎవరికి తెలియట్లేదు. ఉత్తరాంధ్రలో ఐతే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ఏ ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు. మునుపటిలా గుడివాడ అమర్, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పరిస్థితి ఐతే మునుపటిలా లేవు. మొత్తం వీరి కోరలు పీకేశారు పవన్. ఈ నేతలు అంతా అడ్రెస్స్ లేకుండా పోయారు.

రోజా వద్దులే.. కాపు సంగతి అసలొద్దు!

ఇక కోస్తాంధ్ర, రాయలసీమ విషయానికి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీని తొక్కిపట్టి నార తీసేసారు పవన్. అంబటి రాంబాబును ఎందుకో టచ్ చేయడానికి ఆయన సాహసించడం లేదు. ఇందుకు సామాజిక వర్గమే కారణమని చర్చ నడుస్తోంది. అంతేకాదు రోజాను అస్సలు సేనాని పట్టించుకోవట్లేదు. మహిళా కావడం, ఆమెను తానే టార్గెట్ చేస్తే విమర్శలు వస్తాయని మహిళా మంత్రులకు అప్పగించారు. మాజీ మంత్రిని హోం మంత్రి అనిత గట్టిగానే చూసుకుంటున్నారు. ఇప్పుడిక అసలు సిసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు సమయం, సందర్భం దొరికినప్పుడల్లా చుక్కలే చూపిస్తున్నారు సేనాని. ఇప్పటికే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ముప్పు తిప్పలు పెట్టిన పవన్.. ఇప్పుడు అటవీ భూమలను ఆక్రమించి మామిడి తోట, పెద్ద పెద్ద షెడ్లు, ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు తేలడంతో స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగిపోయి విచారణకు ఆదేశించారు. ఐతే తాను ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని ఇప్పటికే పలుమార్లు ఎంతో మంది ఫిర్యాదులు చేయగా అధికారులు మొదలు, కోర్టుల వరకూ అంతా సక్రమమే అని తేల్చిన విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు తానా అంటే డిప్యూటీ సీఎం పవన్ తందానా అంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

అటు అభివృద్ధి.. ఇటు చేరికలు!

ఒకవైపు వైసీపీ లీడర్ల భరతం.. మరోవైపు అభివృద్ధి.. ఇంకోవైపు చేరికతో పార్టీ బలోపేతం ఫుల్ క్లారిటీతో డిప్యూటీ ముందుకెళ్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖతో పల్లెల రూపు రేఖలు మొత్తం మార్చేస్తున్నారు. రోడ్లు, ఇంటింటికీ కుళాయి, వాటర్ ట్యాంకులు, గోకులాలు, మన్యంలోని గ్రామాలకు సైతం రోడ్లు ఇలా ఒకటా రెండా తన శాఖ పరిధిలోని అన్నిటినీ సక్రమంగా వాడుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక టార్గెట్ వైసీపీ అంటూ కార్యకర్తలు మొదలు.. నేతలు, ముఖ్య నేతల వరకూ ఎవరైనా సరే పార్టీలో చేరొచ్చు అని డోర్లు తెరిచే ఉంచారు. చేరికల విషయంలో టీడీపీ, బీజేపీ అయినా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు తగ్గేదేలా అంటూ ముందుకెళ్తున్నారు. వైసీపీకి గొంతుగా ఉన్న నేతల నోటికి ఇప్పటికే తాళం దాదాపు వేసిన సేనాని.. ఇప్పుడిక ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. అటు క్యాడర్ ఐతే ఇప్పుడా రేపటి రోజునా అన్నట్టుగా జనసేనలో చేరిపోతున్న పరిస్థితి. త్వరలోనే వైసీపీకి ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేసేస్తున్నారు అన్న మాట. చూశారుగా.. మొత్తంగా వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా యుద్ధమే చేస్తూ జగన్ రెడ్డి లీడర్, క్యాడర్ అనేది లేకుండా చేయడానికి పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు పవన్. ఐతే ఇదంతా పైకి మాత్రం ప్రతీకారం అని ఎక్కడా కనిపించకుండా.. చేయాల్సినదంతా చేస్తూ పాలనలో భాగంగా కానిచ్చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే సగానికి సగం గెలిచిన సేనాని.. ఆ మిగిలిన సగం ఎప్పుడు గెలుస్తారో చూడాలి మరి.

Is Pawan Panjaa revenge.. administration:

Is Pawan Kalyan Panjaa revenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs