శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా చేస్తాడని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సున్నితమైన ప్రేమ కథలు, ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడైన కమ్ముల, విభిన్న జానర్లో సినిమాలు చేసే ధనుష్‌తో కలవడం ఎవ్వరూ ఊహించలేదు. వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న కుబేర పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే, ఈ సినిమా కమ్ముల మార్క్‌తో ధనుష్ శైలికి సరిపోయేలా ఉందనిపిస్తుంది.
సినిమాలో ధనుష్ బిలియనీర్‌గా కనిపించడమే కాదు, బిచ్చగాడి పాత్రలో కూడా నటిస్తున్నాడు. స్టార్ ఇమేజ్ ఉన్నా, ఇలాంటి విభిన్నమైన పాత్ర చేయడం ధనుష్‌లోని ప్రత్యేకత. ఈ పాత్ర గురించి చెప్పడం తనకు సంకోచంగా అనిపించిందని శేఖర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథ సిద్ధమైన తర్వాత ధనుష్‌ను సంప్రదించాలనిపించినప్పటికీ, బిచ్చగాడి పాత్ర గురించి చెప్పడంపై సందిగ్ధతలో ఉన్నట్టు చెప్పాడు. కానీ ధనుష్‌కు ఫోన్ చేసినప్పుడు ఆయన తన గురించి తన సినిమాల గురించి మాట్లాడటం శేఖర్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ధనుష్ వంటి నటుడితో పనిచేయడం గొప్ప అనుభవమని చెప్పారు.
ఇక కథానాయిక రష్మిక మందన్నా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తుందని తెలిపారు. ధనుష్, రష్మిక జంట స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. రష్మిక పుష్ప-2 షూటింగ్, యానిమల్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నా.. ఈ సినిమా కోసం పూర్తిగా అంకితభావంతో పనిచేసిందని, ఆమె శ్రద్ధ, ప్రొఫెషనలిజం గొప్పగా అనిపించాయని శేఖర్ వివరించారు.