టాలీవుడ్ యువహీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మార్చి 28, 2025న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా ధృవీకరించింది.
వాస్తవానికి రాబిన్ హుడ్ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల చిత్ర బృందం విడుదలను వాయిదా వేయడం జరిగింది. ఈ సమయంలోనూ విడుదల తేదీని ఖరారు చేస్తూ, కొత్త అనౌన్స్‌మెంట్ చేశారు. అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
అదేరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదల కానుంది. ఈ విడుదల తేదీ కారణంగా నితిన్, పవన్ మధ్య ఒక రకమైన పోటీ ఏర్పడినట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం, దేవుడు అంటూ పూజించే నితిన్, తన అభిమాన హీరోతోనే బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. రాబిన్ హుడ్ టీజర్, పోస్టర్లు ఇప్పటికే సినిమా పై హైప్‌ని పెంచాయి. మార్చి 28న నితిన్ పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.