మంచు కుటుంబం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఏ రూపంలో ఈ ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయో..? ఎవరెవరు కొట్టుకుంటారో..? ఏ విషయంలో రచ్చకు దిగుతారో..? అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకూ ఒక లెక్క ఐతే తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రాకు ఈ గొడవలు బదిలీ అయ్యాయి! పండగ పూట తిరుపతిలోని విద్యానికేతన్ వేదికగా రచ్చ రచ్చే అయ్యింది. మంచు ఫ్యామిలీ వర్సెస్ మనోజ్ అన్నటుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలోని నారావారిపల్లిలో ఉన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ - మనోజ్ మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. దీంతో మంచు ఇంట్లో వివాదం మరింత ముదిరింది. ఏం జరిగినా సరే కాలేజీ గేట్లు తెరిచే ప్రసక్తే లేదని అటు ఇటు బౌన్సర్లు కొట్టుకున్నారు. పోలీసుల రంగప్రవేశం.. నోటీసుతో వివాదం సద్దుమణుగుతుందనుకునే లోపు అసలు సిసలైన సీన్ అప్పుడే మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకోవడంతో, ఈ వ్యవహారం మరోసార పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో చల్లారినట్టే కనిపించిన మంచు ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు పుట్టినట్టు అయ్యింది.
గొడవకు కారణం ఇదీ..!
చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్‌బాబు యూనివర్సిటీ సిబ్బంది, హేమాద్రి నాయుడు, కిరణ్‌పై మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన ఆయన.. తమ కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం అని, గొడవలు సృష్టించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు. తన ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం, అభిమానులను బెదిరించడంతోనే వివాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. నానమ్మ, తాతయ్యల సమాధులకు దండం పెట్టుకోనివ్వరా? అంటూ పోలీసులు, కుటుంబ సభ్యులను మనోజ్ ప్రశ్నించాడు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో ఫ్యామిలీ విషయాలు చర్చించలేదని చెప్పాడు. తనకు సాయం చేయాలని ఎవరినీ అడగలేదు.. అడగాలనే ఉద్దేశం కూడా లేదని చెప్పుకొచ్చాడు.
కడుపు నొప్పి!
తనపై, మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదు? అని పోలీసులనే మనోజ్ తిరిగి ప్రశ్నించాడు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్‌కు పోలీసులు సూచించిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఐతే సమావేశం మధ్యలోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు మనోజ్. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. కడుపు అలానే పట్టుకొని భరించలేని నొప్పితో బాధపడుతున్న ఆయన్ను హుటా హుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన అభిమానులు, బౌన్సర్లు, అనుచరులు చికిత్స అందించారు. ఈ క్రమంలో మనోజ్ భార్య మౌనిక ఆందోళనకు గురై కంటతడి పెట్టుకుంది. మరోవైపు మనోజ్ అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. మనోజ్ కాస్త కుదుట పడ్డాక మల్లయ్యగారిపల్లెకు దంపతులు వెళ్లిపోయారు.