సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడు మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరి ప్రస్తావన వస్తే.. పెద్దోడు, చిన్నోడు అనే వారిని పిలుస్తుంటారు. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ప్రత్యేకం. ఆయనకు సినిమా నచ్చితే చాలు.. సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై రియాక్ట్ అవుతూ రివ్యూ ఇచ్చేస్తారు.
అయితే ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రూపంలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడింటిలో మహేష్ కేవలం ఒకే ఒక్క సినిమాపై రివ్యూ ఇచ్చి.. వెంకీమామ తనకెంత స్పెషలో మరోసారి తెలియజేశారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన మహేష్.. ఇది అసలు సిసలైన పండగ సినిమా అంటూ స్పందించారు.
వెంకీమామ అద్బుతమైన నటనతో అలరించారని తెలిపిన మహేష్, తనతో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసిన అనిల్ రావిపూడి ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నందుకు గర్వంగానూ, సంతోషంగానూ ఉందని అన్నారు. హీరోయిన్లు ఇద్దరూ వారి పాత్రలలో చక్కగా ఒదిగిపోయారని చెప్పిన మహేష్, ఇందులో బుల్లిరాజుగా నటించిన బుడతడిని ప్రత్యేకంగా అభినందించారు. టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు.
అయితే మహేష్ రియాక్షన్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. కేవలం పెద్దోడి సినిమాకే చిన్నోడు స్పందించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది. వెంకీ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి హయ్యస్ట్ కలెక్షన్స్ రాబడుతూ.. రికార్డులు క్రియేట్ చేస్తోంది.