అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో వైకుంఠ దర్శనం కోసం ఇచ్చే టోకెన్లు విషయంలో తొక్కిసలాట జరగడం, ఆరుగురు దుర్మరణం చెందడం అందరినీ తీవ్రంగా కలచి వేస్తోంది. తిరుమల చరిత్రలో మునుపెన్నడూ జరగని.. కనివినీ ఎరుగని సంఘటన ఇది. దీంతో అసలేం జరిగింది..? ఈ ఘటనకు కారకులు ఎవరు..? ఎక్కడ సమన్వయ లోపం ఉంది..? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడిన మాటలేంటి..? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలకు ఎందుకు పొంతన లేదు? అసలు సమస్య ఎక్కడుంది..? ఎవరు ఎవరికి సహరించడం లేదు..? వేటు వేయలసింది ఎవరిపైన..? వేటు, బదిలీ ఎవరిపైన పడింది..? అసలు సమస్య ఎక్కడుంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
ఇదీ అసలు సంగతి..!
టీటీడీ చైర్మన్ పదవీ బాధ్యతలు బీఆర్ నాయుడు చెప్పటిన నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా ఎలాంటి బేధాభిప్రాయాలు బయట పడలేదు కానీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరిల మధ్య లేనిపోని తలనొప్పులు ఉన్నాయన్నది లోగుట్టు. ఈ ముగ్గురు ఎవరికి వారే యమునా తీరే అన్న తీరులో ఉండటంతో ఈ ఘోర ఘటన జరిగిందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఒకరిపై ఒకరికి అస్సలు పడకపోవడం, నేనే గొప్ప అంటే నేనే అని పంతాలు పట్టింపులకు పోవడం.. తీరా ఏర్పాట్ల విషయాల్లోనూ ఇలాగే జరిగిందన్నది నడుస్తున్న పెద్ద ప్రచారం. ఈ ముగ్గురూ కలిసి పోలీసు ఉన్నతాధికారులతో సక్రమంగా సమీక్ష చేసుకొని అంతా సవ్యంగా సాగి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని టీటీడీలోని కొందరు చెబుతున్న మాటలు.
అయ్యో.. అధికారులు!
టీటీడీ మొత్తం మీద కీలక వ్యక్తులు ఛైర్మెన్, ఈవో, అదనపు ఈఓలే. ఐతే ఈ ముగ్గురు ప్రతి విషయంలోనూ సమన్వయం ఉండాల్సిందే. లేని పక్షంలో ఇప్పుడు జరిగిన ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఎందుకంటే.. ఓవైపు ఛైర్మెన్ బీఆర్ నాయుడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు మీడియా సాక్షిగా కుండ బద్దలు కొట్టేశారు. 5 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా కూడా దురదృష్టకర ఘటన జరిగిందని కూడా చెప్పేసారు. ఇక చివరిగా చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదనీ, తాను ముందే చెప్పినా పోలీసులు చూసుకుంటామని చెప్పారని మీడియా ముందు చెప్పకనే చెప్పేసారు. అటు తొక్కిసలాట ఘటనకు కారణాలపై విచారణ జరుగుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పుకొచ్చారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు తెలిసిందని చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇక అదనపు ఈవో ఐతే మీడియా ముందుకు రావడానికే కంగారు పడిన పరిస్థితి. ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు.
ముగ్గురూ.. మూడు రీతుల్లో..!
అటు ఛైర్మెన్ మాటలు విన్నారు కదా.. ఇప్పుడిక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది కూడా ఒక లుక్కేయండి. మరోవైపు అధికారులకు ఆరు బయట.. సమీక్షలో గట్టిగా ఇచ్చి పడేశారు. బాధ్యత లేదా..? మానవత్వం మీలో చచ్చిపోయిందా..? అని కూడా తిట్టిపోయడం గమనార్హం. ఇక సీఎం చివరికి డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని సస్పెండ్ చేశారు. మరోవైపు.. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు మీడియా ముఖంగానే ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తొక్కిసలాట ఘటనకు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలే పూర్తిగా బాధ్యత వహించాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం గమనార్హం.
ఎందుకు ఈ తేడాలు?
మరి టీటీడీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు.. పాలకమండలి సభ్యులు.. లోకల్ లీడర్లు పవన్ కళ్యాణ్, చంద్రబాబులలో ఎవరికి ఆపద్దం చెప్పారు..? ఇంకెవరికి నిజం చెప్పారు..? లేదంటే ప్రాథమిక సమాచారం లేదా అసలు అవగాహన లేకుండానే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడే మాటలు కాదు కదా..? ఇక్కడే అందరికీ సందేహాలు పుట్టుకొస్తున్నాయి. టీటీటీ ఈవో.. అదనపు ఈవో.. ఇద్దరితో పాటు ఛైర్మెన్ బాధ్యుడు అంటూ పవన్ గొంతు చించుకొని మరీ చెబితే ఈ ముగ్గురిని పక్కనపెట్టి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, అలాగే సీఎస్‌వో శ్రీధర్‌లను మాత్రమే బదిలీ చేయడం.. మరో ఇద్దరిని సస్పెండ్ చేయడంతో డిప్యూటీ సీఎం మాటలకు అసలు అర్థం అంతకు మించి విలువ లేదా..? అన్నది సీఎం.. డిప్యూటీలకే తెలియాలి.
మాటలు సరే చేతలేవి..?
దీంతో చంద్రబాబు ఇక్కడ కూడా భేదాలు చూపించి.. తనకు కావాల్సిన వాళ్లను వెనకేసుకొచ్చారనే విమర్శలు సొంత క్యాడర్ నుంచి కూడా వెల్లువెత్తుతుండటం గమనార్హం. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ప్రతిసారీ ఇక మామూలుగా ఉండదు.. పాత చంద్రబాబును చూస్తారు అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు కానీ ఇప్పటి వరకూ ఆ మాటలు ఆచరణలోకి వచ్చిన దాఖలాలు మాత్రం ఒక్కటంటే ఒక్క శాతం కూడా ఎక్కడా కనిపించలేదు. ఇది ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నేతలను అడిగినా చెబుతారు. బహుశా పాత చంద్రబాబే ఉండి ఉంటే 100కు వెయ్యి శాతం.. ఇంతటి దారుణ వైఫల్యం తర్వాత తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పైన చర్యలు తప్పకుండా ఉండేవి. దీంతో కాటు ఈవో, అదనపు ఈవో ఇంకా అవసరం ఐతే ఛైర్మెన్ పైన కూడా చర్యలు ఉండేవి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఉండేది పాత చంద్రబాబు ఏ మాత్రం కాకపోవడంతో ఎలాంటి చర్యలు లేవు.. కేవలం హెచ్చరికలకు మాత్రం పరిమితం కావడం చూస్తున్నాం. దీంతో ఊహించుకున్నోళ్ళకు ఊహించుకున్నంత అన్న మాట.