అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని.. మరీ ముఖ్యంగా గత టీడీపీ హయాంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నది గత ఆరు నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, నేరాలు, ఘోరాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడిన మాటలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు టీడీపీ కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలే స్వయంగా సోషల్ మీడియా, మీడియా వేదికగా ప్రభుత్వంపై తిట్టిపోస్తున్నారంటే ఇంతకు మించి మరో సాక్ష్యం అస్సలు అక్కర్లేదు. ఇక ఏపీ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చింది.. ఇంకా వస్తోంది అనే విషయాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇక చాలు దేవుడా..!
ఈ వరుస ఆరోపణలు, విమర్శలు, చోటు చేసుకున్న పరిణామాలు.. మరీ ముఖ్యంగా తిరుపతి ఘటన, ఆస్పత్రి వద్ద స్వయంగా తాను చూసిన, అనుభవించి కొన్ని అంశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారని సచివాలయ వర్గాలు, ప్రభుత్వ, ఏపీ రాజకీయవర్గాల నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇంతకు మించి ఏ ఒక్క ఘటన జరగడానికి వీల్లేదు.. నేను అస్సలు ఏదీ జీర్ణించుకోలేకపోతున్నాను.. అసలు పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు వినాలా..? పోలీసులు చెప్పినట్టు ప్రభుత్వం వినాలా..? ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు పదే.. పదే శాంతి భద్రతల విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది..? అని పవన్ కళ్యాణ్ కుంగిపోయారట. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని సైతం పక్కనెట్టి ఐదు కోట్ల ఆంధ్రులు కూటమికి పట్టం కడితే వాళ్ళ ప్రాణాలు ఇలా అర్ధంతరంగా పోవడం ఏంటి..? ఇదేనా సుపరిపాలన? ఇక చాలు దేవుడా..! అని తన అత్యంత సన్నిహితులు, ఆప్తులకు చెప్పుకొని తీవ్ర మనస్తాపానికి డిప్యూటీ సీఎం గురయ్యారట.
ఇక మాటల్లేవ్..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తిరుపతి పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే ప్రత్యేక విమానంలో వెళ్ళేటప్పుడు తన మనసులోని మాటను డిప్యూటీ సీఎం కక్కేసారని తెలియవచ్చింది. ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇక ఎలాంటి ఘోరాలు జరగకూడదు అంటే హోం శాఖ తనకు ఇవ్వాల్సిందే.. దయచేసి హోం ఇచ్చి చూడండి.. సత్తా ఏంటో చూపిస్తాను అనడమే ఆ కీలక సంభాషణ సారాంశం అని లీకులు వచ్చాయి. ఇక ఇదిగో ఇలా చేస్తాం.. అలా చేస్తాం అని ప్రజలకు మాటలు చెప్పడం దగ్గరే ఆగిపోయిందని.. ఇక మాటల్లేవ్.. చేతల్లోనే చూపించాలని, ప్రజలు మన ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసే బాధ్యత మనపైన ఉందని గట్టిగానే చంద్రబాబుకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చేంత వరకూ ఈ విషయాలపైనే ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందని సమాచారం.
నాడు అలా.. నేడు ఇలా..!
వాస్తవానికి హోం శాఖ తీసుకోవాలనే ప్రపోజల్ కూటమి అధికారంలోకి వచ్చాక తొలుత పవన్ కల్యాణ్‌కే వచ్చినప్పటికీ.. వద్దని వదిలేసుకున్నారు. ఆ తరవాత శాంతి భద్రతల విషయంలో. ఆయన వెళ్లక్కిన అసంతృప్తి, ఆందోళన అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకుంటూ ఉండటంతో హోం శాఖను ఇప్పించాలని భావించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్న పవన్ ఇప్పుడిక వాళ్ళు.. వీళ్ళు వద్దు తానే హోం శాఖ తీసుకోవాలని.. శాంతి భద్రతలు అంటే ఎలా ఉండాలి..? అనేది రుచి చూపించాలని బలంగా అనుకుంటున్నారట. ఒక్కసారి హోం శాఖ తీసుకుంటే అదిగో పలానా పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా చేశారు.. అలా చేశారు.. అని అందరూ కొన్నేళ్ల పాటు చెప్పుకునేలా.. జనం మనసుల్లో నిలిచిపోయేలా హోం శాఖను నిర్వహించాలని ఒక విజనరీతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట సేనాని. ఇది ఎంత వరకూ జరిగి తీరుతుంది..? ఒకవేళ బాబు హోం లాంటి శాఖను తన పార్టీని కాదని జనసేనకు ఇవ్వడం అంటే మామూలు విషయం కానే కాదు. మరి ఇదంతా ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో..? పవన్ హోం మంత్రి ఎప్పుడు అవుతారో..? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.