సినీ నటుడు నాగార్జున పర్యాటకులను తెలంగాణకు ఆహ్వానిస్తూ, ఇక్కడి అద్భుత ప్రదేశాలను సందర్శించమని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణలోని అద్భుత ప్రదేశాలు, ఆహారంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నాగార్జున జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం వంటి ప్రకృతి సౌందర్యం ఉన్న ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. ఆయన వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, యాదగిరి గుట్ట వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి కూడా మాట్లాడారు.
అలాగే తెలంగాణ వంటకాలలో జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్, సర్వపిండి, ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్, హైదరాబాద్ బిర్యానీ వంటి ప్రత్యేకతలు తనకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయని చెప్పారు. ఈ వంటకాలు ఇప్పుడు చెప్పుకుంటుంటే ఆయనకు నోరూరుతున్నట్లు తెలిపారు.
ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన తెలంగాణ టూరిజం, నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నాగార్జున, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న కూలి సినిమాలో నటిస్తుండగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.