తిరుపతి తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో ఇందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదని, నిండు ప్రాణాలు బలి తీసుకుంటారా? అంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనలో డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు.. ముగ్గురు అధికారులపైనా బదిలీ వేటు పడింది. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌పై స్వయానా చంద్రబాబే బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరుపతిలోనే ఘటనాస్థలి పరిశీలన, బాధితుల పరామర్శ, వరుస సమీక్షలతోనే గడిచిపోయింది. ఈ పరిణామాల తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటాను. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించాను. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాను. అధికారులతో సమీక్ష నిర్వహించాను. ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తాను. ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని సూచనలు కూడా చేశాను. నా సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే మంచిది కాదు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదు. తిరుపతిలో దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతోనే పని చేయాలని చంద్రబాబు సూచించారు.
ఎందుకు పెంచారు?
వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించాలని భక్తులంతా కోరుకుంటారు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. తిరుమలలో క్యూలైన్లలో ఉంటే భక్తులు దైవ చింతనలోనే ఉంటారు. వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు పెంచారు, ఎందుకు పెంచారో తెలియదు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి. ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. వెంకటేశ్వరస్వామి అంటే భక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పవిత్ర దినాల్లో స్వామిని దర్శించుకోవాలన్న భావన పెరుగుతోంది. పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం చంద్రబాబ తేల్చి చెప్పారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటన
తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఆరుగురు మృతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాలు, తీవ్రంగా గాయాలైన ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం, ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామన్నారు. అంతేకాకుండా గాయాలైన 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, గాయపడిన 35 మందికి శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. గాయపడినవారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణకు సీఎం ఆదేశించారు. వాస్తవాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని, కొందరు అధికారులు నిర్లక్ష్యంగా పనిచేశారని మండిపడ్డారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా ప్రవర్తించారని, డీఎస్పీ ఆలోచన లేకుండా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా? టెక్నాలజీ వాడుకోలేవా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.