రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పెరిగిన టికెట్ ధరల వల్ల ప్రజలపై భారం పడుతుందని పిటిషనర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ కేసును గతంలో నమోదైన పుష్ప 2 టికెట్ రేట్ల కేసుతో పాటు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుపై కూడా ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై శుక్రవారం హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుందని పేర్కొంది. రామ్ చరణ్ తొలిసారిగా తండ్రి, కొడుకు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం, శంకర్ దర్శకత్వంలో సినిమా ఉండటం వంటి కారణాలతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
రంగస్థలంలో రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చినట్లు, గేమ్ ఛేంజర్ సినిమాతో ఆయన నటన జాతీయ అవార్డు స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. శంకర్ గత సినిమాలు మిశ్రమ ఫలితాలు సాధించినా, ఈ సినిమా ఆయన వింటేజ్ స్టైల్‌ను గుర్తుచేస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తర్వాత టికెట్ రేట్ల పెంపు ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.