తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ క్షమాపణలు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన వైఫల్యంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు శ్రీవారి భక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలంతా తిరుపతి స్విమ్స్ దగ్గర తిష్టవేశారు. మరోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్షమించండి..
అభిమానులు, పోలీసులపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా? అంటూ ఆయన కన్నెర్రజేశారు. తప్పు జరిగింది.. క్షమించండి అంటూ చేతులెత్తి చెప్పారు. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదని, తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్ చేయలేరా? ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని పవన్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో తప్పు జరిగిందన్నది వాస్తవమే, క్షమించండి.. టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిందేనని పవన్ కోరారు. ఈ తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకొచ్చారన్నారు. అధికారులే బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. అంతేకాదు.. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని.. సామాన్యుల దర్శనాలపై ఇకనైనా టీటీడీ దృష్టిపెట్టాలని ఒకింత క్లాస్ తీసుకున్నారు.
ఇదీ అసలు కథ..
పవన్ కళ్యా్ణ్ పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడుతుండగానే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్పత్రిలోకి రావడానికి యత్నించారు. అయితే మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు కాన్వాయ్‌ను ఆపేశారు. అయితే జగన్ మాత్రం ప్రైవేట్ వాహనంలో అక్కడ్నుంచి ఆస్పత్రికి వెళ్లిపోయారు. అటు పవన్.. ఇటు జగన్ ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో జై జనసేన.. జై పవన్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేశారు. ఇటు వైసీపీ కార్యకర్తలు సైతం జై జగన్.. జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్విమ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయాక.. అంటే అరగంట ఆలస్యంగా రావాలని పోలీసులు జగన్‌ను కోరారు. అరగంట నేను ఎదురు చూడటం ఏంటి? అని జగన్ అనుకున్నారో లేకుంటే అక్కడుండే వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడంతోనో ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి.. అటు అభిమానులు, కార్యకర్తలు.. ఇటు పోలీసులు, టీటీడీ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.