నిజంగా జనాలు వెర్రివాళ్ళు కాదు వెర్రి గొర్రెలు అనాలి. ఏదైనా కొత్తగా కనిపించింది అంటే చాలు వేలం వెర్రిగా ఎగబడిపోతారు. ఆడవాళ్లకు చీరలపై డిస్కౌంట్ పెడితే అక్కడ వాలిపోవడం కాదు, చీరల కోసం ఎగబడతారు. ఇక గుడులు, గోపురాలు, ఇంకా రెస్టారెంట్స్ ఇలా ఎక్కడైనా కాస్త పేరు వినిపిస్తే చాలు అక్కడ కాకుల్లా వాలిపోతారు. అభిమానాల తారల కోసం తోసుకుంటారు, తొక్కుకుంటారు. సోషల్ మీడియా వచ్చాక ఆ వెర్రి మరింతగా పెరిగింది.
ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ అయితే అక్కడ కాంబో ప్యాక్ పై ఆఫర్ అనగానే క్యూ లో జనాలు కనబడతారు. ఇక ఫెస్టివల్స్ వచ్చాయంటే గుడుల దగ్గర దేవుడి దర్శనం కోసం లైన్ లు కడతారు. సినిమా హీరో వచ్చాడంటే వెర్రిగా చూసేందుకు ఎగబడతారు. హీరో దర్శనం కోసం తొక్కేసుకుంటారు. అలానే నిన్నగాక మొన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట.
ఈరోజు తిరుమల వైకుంఠ ద్వారా దర్శన టోకెన్స్ కోసం తొక్కిసలాట. అందరూ ప్రభుత్వాలని, పోలీసులని తప్పుపట్టేయ్యడానికి ముందుంటారు కానీ.. తాము చేసింది తప్పని ఒప్పుకోరు. తిరుమల తిరుపతినే తీసుకోండి. కంపార్ట్మెంట్స్ లో గంటలు గంటలు వేచి చూస్తారు. లైన్ వదలగానే తోసుకుంటూ వెళతారు. కనీసం శ్రీవారిని కంటి నిండా చూడనిస్తారా అంటే అదీ లేదు. అక్కడా తోపులాట.
అదంతా కేవలం జనాల అజ్ఞానం. చదువుకున్నవాళ్లు కూడా అదే తీరు, చదువు లేని వాళ్లంటే చెప్పుకోవచ్చు. తిరుపతి క్యూ లైన్ తొక్కిసలాట ఘటనకు అక్కడ భద్రతా వైఫల్యం ఎంతవరకు కారణమో.. భక్తుల ఆరాటమంతే కారణం. అలా అంటే ఒప్పుకోరు, ఒక్కసారిగా వదిలారు తోసుకున్నామని చెబుతారు తప్ప.. తమ తప్పు ఉంది అనరు, తప్పంతా పోలీసులు మీదే నెట్టేస్తారు. నిజంగా వెర్రి జనాలు మారరా.