ఏమిటీ 700 కోట్ల స్కామ్.. శ్రీకాంత్-రీతూలకు ఏమైంది?
ఏపీలో గత వారం రోజులుగా ల్యాండ్ మాఫియా వ్యవహారం పెను సంచలనం రేపింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో బుల్లితెర నటి రీతూ చౌదరి పేరు రావడంతో ఇంత హడావుడి జరిగింది. ఈ ఒక్క ఘటనతో రీతూ హాట్ టాపిక్ కావడమే కాకుండా ఆమెకు పెళ్లయ్యిందని.. వైసీపీ నేతలతో చేతులు కలిపి లేనిపోని విషయాల్లో తలదూర్చి అడ్డంగా బుక్కయ్యారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా ల్యాండ్ మాఫియా..? రీతూ చౌదరికి ఏంటి సంబంధం? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి.
ఏమిటీ ల్యాండ్ కుంభకోణం..?
మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి రెడ్డిల బలగం తనతో అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, సీఎం చంద్రబాబుకు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ రిటైర్డ్ అధికారి ధర్మసింగ్ లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ధర్మసింగ్ ను రహస్య ప్రాంతంలో విచారణ చేసి కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పీఏ కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిపై సింగ్ ఆరోపణలు చేశారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.700 కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ జనాలను బెదిరించి బలవంతంగా ఈ ఆస్తులు లాక్కున్నట్టు సింగ్ ఆధారాలతో సహా పూస గుచ్చినట్టు చెప్పేసారు. అంతేకాదు కొన్ని ఆస్తులు వాటి యజమానులకు తెలియకుండానే చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయని కూడా సింగ్ చెప్పడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏసీబీ దాడులు చేయిస్తామని, చంపుతామని తనను బెదిరించి ఇలా చేశారని సింగ్ చెప్పేసారు. వాళ్ళు చేసిన ప్రతీ పనికీ ఆధారాలు ఉన్నాయని కూడా ధర్మసింగ్ అటు లేఖలో.. ఇటు విచారణలో సంచలన నిజాలు అన్నీ బయటపెట్టారు. రిజిస్ట్రేషన్లు చేయబోనని చెప్పడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించిన విషయాన్ని కూడా చెప్పారు సింగ్. జగన్ భార్య భారతికి చీమకుర్తి శ్రీకాంత్ బినామీ అని.. చెప్పుకొచ్చారు. దీంతో అటు శ్రీకాంత్, ఇటు రీతూ.. జగన్ సోదరుడు, పీఏ అడ్డంగా దొరికిపోయారు. సింగ్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుం డటంతో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
నాకు పెళ్ళి అయ్యింది కానీ..!
ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చుకుంది. అవును నాకు పెళ్లి అయ్యింది. కానీ ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే అతనికి దూరంగా వచ్చేసాను. నాలుగు నెలలు మాత్రమే మేము కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఎవరి వారుగా విడి విడిగా ఉంటున్నాం. విడాకులు గురించి కోర్టులో కేసు నడుస్తోంది. శ్రీకాంత్ అనే వ్యక్తిని నేను గుడ్డిగా నమ్మాను.. మోసపోయాను. నన్ను కుంభకోణంలోకి లాగకండి. ఇంతకు మించి ఏమి చెప్పలేనని రీతూ చెబుతోంది. నా పేరున ఎలాంటి భూములు లేవు. నేను ఎవరికీ బినామీగా లేను. నాకు సంబంధం లేని దాంట్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారు..? నా ఇష్యూ కోర్టులో ఉంది. ఏడాది క్రితమే నేను శ్రీకాంత్‌కి విడాకులు ఇస్తూ కోర్టుకి వెళ్లాను. అది కోర్టులో ఉంది. కానీ ఇప్పుడు అతని భార్యనని.. నేను బినామీ అని అంటున్నారు. స్కాంలు చేస్తున్నాం అని అంటున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు.. నా బతుకు నేను బతుకుతున్నా. నాకు ఆ రిజిస్ట్రేషన్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఏదో సంతకం పెట్టమంటే పెట్టానంతే. దానితో నాకేం సంబంధం లేదు. వనం దివ్య అంటే నేనే. అయితే సంతకం పెట్టానంటే పెట్టా అంతే అని చాలా సింపుల్‌గా తేల్చింది రీతూ చౌదరి.
శ్రీకాంత్ వర్షన్ ఇదీ..
మా నాన్న పెద్ద కంట్రాక్టర్. కావాలంటే మా ఊరు వెళ్లి కనుక్కోండి. నేను ఎయిర్ టెన్ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాను. ఏడాదికి రూ.15 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ చేశాను. ఇలా ఆరేళ్ల పాటు చేశాను. మేం ఆర్ధికంగా బలమైన వాళ్లమే. ఆదాయ పన్ను కూడా రెగ్యులర్‌గా చెల్లిస్తున్నాం. మాది బ్రాహ్మణ కుటుంబం. సింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను ఒక ఫేక్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన బినామీల ద్వారా దొంగ పత్రాలతో 48 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సింగే నాకు రూ.40 లక్షలు ఇవ్వాలి.. అతని వల్ల నేను చాలా నష్టపోయాను. రీతూతో గొడవలు కావడానికి కూడా ఏసీబీ వాళ్లే కారణం. రీతూకి నేను సేల్ లీడ్ ఇవ్వలేదు. రీతూతో నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీపై పవర్ మాత్రమే ఇచ్చాను. సేల్ లీడ్ కాదు. నాకు రీతూ చౌదరి నుంచి విడాకుల నోటీసులు ఇంకా రాలేదు. అది మా పర్సనల్ ఇష్యూ. నాకు సంబంధం లేని విషయంలో ఏసీబీ వాళ్లు ఇరికించారు. నా సొంత ఆస్తుల్ని కూడా లాక్కున్నారు. నా భార్య అయిన రీతూ చౌదరిని ఈ కేసులో ఇరికించి, ఆమెను ఏసీబీ వాళ్లు తీసుకుని వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించారు. నరకయాతన చూపించారు. దాని తరువాత మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రీతూ చౌదరిని ఏసీబీ వాళ్లు విచారించారు.
వాళ్ళతో నాకు ప్రాణహాని!
నా పేరు మీద నిజంగా రూ.700 కోట్లు ఉంటే ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్ధమే. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్‌పై ఏసీబీ దాడులు నేను చేయించలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికే సింగ్ అలా మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లే నాకు రిజిస్ట్రార్లతో పరిచయాలు ఉన్నాయి అంతే. వ్యాపారంలో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ల వద్ద డబ్బులు తీసుకోవడం తప్ప.. మిగతా ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సుద్దపూస ఏమీ కాదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ గనక అవకాశమిస్తే సబ్ రిజిస్ట్రార్ల బాగోతం మొత్తం బయటపెడతాను. ఏసీబీ నన్ను ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు.. అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏసీబీ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోతే పని జరిగేది కాదు. ధర్మసింగ్ స్వయంగా ఏసీబీ ఆఫీసర్లకి డబ్బులు ఇస్తాడని ఆధారాలు ఉన్నాయి. ఏసీబీలో డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఎవరూ పని చేయరని చీమకుర్తి శ్రీకాంత్ వెల్లడించారు.
ఏసీబీ వాళ్ళే మా మధ్య గొడవ..!
ఏసీబీ ఇష్యూ వల్లే రీతూ చౌదరికి నాకు గొడవలు వచ్చాయి. రీతూ చౌదరికి లేనిపోనివి చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. రీతూకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయిలతో వ్యాపారం, అప్‌కమింగ్ హీరోయిన్లతో బిజినెస్ వ్యవహారాలు నిజం కాదు. వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి పేరుపై ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఒత్తిడి తెచ్చాననడం సరికాదు. నాకు వందల కోట్లు ఆస్తులు ఏమీ లేవు.. కావాలంటే నిరూపించండి. వైసీపీ నేతలతో నాకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. సజ్జల, ధనుంజయ్‌రెడ్డి, కేఎన్ఆర్ మొదలైనవారి సబ్ రిజిస్ట్రార్లతో మంచి సంబంధాలు ఉన్నమాట వాస్తవం అని చీమకుర్తి శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో మొత్తం విషయాన్ని బయట పెట్టారు.