మోదీ ఆగయా.. వరాలుంటాయా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. అంతకుముందు న్యూ ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడ్నుంచి నేరుగా ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలు రోడ్ షోలో పాల్గొన్నారు. పూలవర్షంతో ప్రధాని మోదీకి స్థానికులు, అభిమానులు, కూటమి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఓపెన్ టాప్ జీపులో ప్రధాని మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ రోడ్‌షో నడిచింది. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో ముందుకు సాగింది. ఓ వైపు ప్రధాని అభివాదం చేస్తుండగా, అటు చంద్రబాబు.. ఇటు పవన్ కళ్యాణ్ ఇరువురూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ, ఏయూలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. తాటిచెట్ల పాలెం, తెలుగుతల్లి ప్లైఓవర్, సిరిపురం వరకు ప్రధాని రోడ్‌షో జరిగింది. మోదీ పర్యటన నిమిత్తం భారీ భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ పర్యటనలో డ్రోన్లు రద్దు చేయడం జరిగింది. ఏపీ టూర్‌లో భాగంగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.
ఏం ప్రకటిస్తారు?
మోదీ ఆంధ్రాకు వచ్చారు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సరే రాష్ట్రానికి ఏమైనా కీలక ప్రకటనలు, వరాలు ఉంటాయా? అని రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు తిరిగి ప్రారంభమైన తరుణంలో కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తుందని రాష్ట్ర ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదనే ప్రకటన కోసం వేయి కళ్లతో జిల్లా వాసులు, కార్మికులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులు, ప్రకటనలు చేస్తారని ఆశతోనే జనాలు ఉన్నారు. మొత్తమ్మీద మోదీ పర్యటనపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాని ప్రసంగంలో ఏముంటుంది? కేవలం రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని మాత్రమే చెప్పి సైలెంట్ అవుతారా? లేకుంటే కీలక ప్రకటనలు చేస్తారా? అని వేచి చూస్తున్న పరిస్థితి. సభా ప్రాంగణంలో వేలాదిమంది ప్రజలు, ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు