వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2020లో వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో సురేష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉండగా.. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హైకోర్టును ఆశ్రయించిన ప్రతిసారీ సీన్ రివర్స్ అవుతూనే ఉంది. బెయిల్ నిరాకరించిన పరిస్థితుల్లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సురేష్ సవాలు చేశారు. మంగళవారం నాడు పిటిషన్‌పై విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. సురేష్ తన పాత కేసుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేయనందున, తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పేసింది. ఈ కేసులో ఛార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ, నందిగం బెయిల్ పిటీషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.
అసలేం జరిగింది?
2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరుల దాడికి తెగబడ్డారు. ఇందుకు కారణం తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించడమే. దీంతో నందిగం సురేష్ అనుచరులు రెచ్చిపోయి మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆమెను హతమార్చారు కూడా. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ హత్యపై ఫిర్యాదు చేసినప్పటికీ అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. 2020 నుంచి ఈ కేసు విచారణ ముందుకు కదల్లేదు. ఎందుకంటే ఘటన జరిగింది వైసీపీ హయాంలో.. చేసింది ఎంపీ అనుచరులు.. ఆయన వైసీపీ ఎంపీ కావడంతో దర్యాప్తు జరగలేదు.
లోకేశ్ రంగంలోకి దిగడంతో..
ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ, రాగానే మరియమ్మ కుమారుడు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విషయం చెప్పాడు. మరియమ్మ మృతి వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును మొత్తం అన్నింటినీ కుమారుడు మంత్రికి చెప్పడంతో కేసు దర్యాప్తు ప్రారంభం కావడం, సురేష్ అరెస్ట్ ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో నందిగంతో పాటు 34 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఊచలు లెక్కెట్టిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించినా సురేష్‌కు మాత్రం బెయిల్ అస్సలు రాలేదు. సెప్టెంబర్-5న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా సురేష్‌పై ఇదొక్కటే కాదు పలు కేసులు కూడా ఉన్నాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులోనూ నందిగం నిందితుడే కావడంతో ఆయనకు ఉచ్చు బిగ్గుస్తున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.