2025 సంక్రాంతి రేసులో ఉన్న ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిన్నోడు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేసి పెద్దోడు వెంకటేష్‌కు, తన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ అంటూ.. వారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవాలని కోరారు. అలాగే, ఈ సినిమాను జనవరి 14న చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా ఇతర టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. అనిల్ రావిపూడి మార్క్ అడుగడుగునా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సిరీస్ చిత్రాల ప్యాట్రాన్‌లోనే ఈ సినిమా ఉండబోతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కాకపోతే.. వెంకీ పక్కన పెళ్లి చేసుకున్న భార్య, పెళ్లికి ముందు ప్రేమించిన ప్రియురాలు ఇద్దరినీ పెట్టి.. అనిల్ రావిపూడి హిలేరియస్ ఎంటర్‌టైన్ చేశాడనేది మాత్రం ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ప్రతి సన్నివేశంలో నవ్వులు పక్కా అనేలా వచ్చిన ఈ ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. హిట్ రేషియోను ఇంకాస్త పైకి లేపేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లాస్ట్‌లో ఉన్న డైలాగ్.. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ప్రతిసారీ విక్టరీయే. ఇప్పుడు కూడా విక్టరీయే.
మరోవైపు ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిజామాబాద్‌లో యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది. వెంకటేష్ ఎక్స్ కాప్‌గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.