తన సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసి, తిరిగి వెళుతున్న క్రమంలో యాక్సిడెంట్‌కి గురై మృతిచెందిన అభిమానుల విషయంలో చాలా బాధగా ఉందని ఆవేదనను వ్యక్తం చేశారు రామ్ చరణ్. ఆయన హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా శనివారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంత పెద్ద ఈవెంట్‌లో ఏం జరగలేదులే.. హమ్మయ్యా అనుకుంటున్న సమయంలో.. వేడుక చూసి ఇంటికి వెళ్లే క్రమంలో యాక్సిడెంట్ జరిగిన ఇద్దరు అభిమానులు మృతి చెందడం యూనిట్‌ని కలిచివేస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు.
రామ్ చరణ్ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే మృతి చెందిన అభిమానుల ఇంటికి తన సన్నిహితులను పంపించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పించారని తెలుస్తుంది. ఈ సమయంలో వారికి అండగా ఉండాలని సన్నిహితులకు సూచించినట్లుగా సమాచారం.
ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. తక్షణ సాయంగా వారి కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు.