హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను చూసి వెళుతూ ఇద్దరు మృతి చెందినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్‌ను చూసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు తిరిగి వెళుతుండగా వ్యాన్ ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన వారి పేరు మణికంఠ, చరణ్ అని తెలుస్తుంది. రాజమండ్రి లోని రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుండగా.. మృతులిద్దరూ కాకినాడకు చెందిన వారని పోలీసులు తెలుపుతున్నారు.
ఈ ఘటనపై గేమ్ చేంజర్ నిర్మాత తాజాగా స్పందించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి వెళుతూ.. ఇద్దరు అభిమానులు మృతిచెందినట్లుగా మా దృష్టికి వచ్చింది. నిజంగా ఇది బాధాకరం. మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షలు నావంతుగా అందించనున్నాను.. అని నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో తెలిపారు.