రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్‌లో ఏపీ మాజీ సీఎం, తెలంగాణ ప్రస్తుతం సీఎంలకు ఒకేసారి క్లాస్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాన్ ముఖ్య అతిథిగా హాజరై, చాలా రోజుల తర్వాత సుధీర్ఘ ప్రసంగం ఇచ్చారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లని ఇబ్బంది పెట్టిన జగన్‌కు, ఇటీవల సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఒకేసారి క్లాస్ అన్నట్లుగా ఆయన స్పీచ్ నడిచింది.
సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ విషయంలో పదే పదే మాట్లాడకండి. సినిమా టికెట్ రేట్లు పెంచడం పట్ల చాలా మందిలో అపోహలు ఉన్నాయి. బ్లాక్ లో టికెట్టు కొని సినిమా చూడడం వల్ల అది ఎవరెవరి జేబుల్లోకి వెళుతుందో తెలియదు.. కానీ, టికెట్ రేటులో పెంచిన ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత సహాయం అందుతుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద వివక్ష లేదని స్పష్టం చేస్తున్నాను. కూటమికి మద్దతు తెలపని హీరోల సినిమాలకు సైతం టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించాం. సినిమా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీగానే చూస్తాం. సినిమాల్లోకి రాజకీయాలను తీసుకురాము. సీనియర్ ఎన్టీఆర్ తనకు వ్యతిరేకంగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు, ఘట్టమనేని కృష్ణతో చక్కగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన నేర్పిన విలువలను మేము కొనసాగిస్తాం.
గత ప్రభుత్వం నా భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ ధరలు పెంచకపోగా తగ్గించింది. హీరోలతో దండాలు పెట్టించుకునే వ్యక్తులం కాదు మేము. తెలుగు చిత్ర సీమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలి, సినిమాలు తీసే వాళ్లతోనే మేము మాట్లాడతాం. సినిమా టికెట్ రేట్లు పెంచమని కోరడానికి నిర్మాతలు లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలి. అంతేకానీ, టికెట్ రేట్లు పెంచే విషయంలో హీరోలతో పని ఏంటి? హీరోల వచ్చి దండాలు పెట్టాలనుకునే కిందిస్థాయి వ్యక్తులం కాదు.
అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. ఒక్క సినిమాకి ఎన్నో వుడ్‌ల నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.