అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరి మంత్రి పదవులు పోతున్నాయనే వార్త కాంగ్రెస్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. అసలే ప్రభుత్వంపై ప్రతిపక్షం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, దీనికి తోడు ప్రతిసారీ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ప్రభుత్వం పరువు కాస్త దుర్గం చెరువులో.. ఇంకాస్త ట్యాంక్‌బండ్‌లో కలిపేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు కేబినెట్‌లో ఏం జరుగుతోంది? ఎందుకిలా నడుస్తోంది? ఎవరి పనితీరు ఎలా ఉంది? ఎవరిలో ఏమేం మార్పులు రావాలి? అనేదానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సర్వే నిర్వహించారని తెలిసింది. ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయని సమాచారం. ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద బర్నింగ్ టాపిక్ అవుతోంది.
ఆ ఇద్దరు వీళ్లే?
ఆ ఇద్దరు మరెవరో కాదు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులేనట. ఈ ఇద్దరి పనితీరుపై అటు జనంలో, ఇటు సొంత నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని తేలిందట. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న మంచి పేరు చాలని, వాళ్ల పనితీరు బాగోలేనప్పుడు, ప్రభుత్వంలో మంచిగా వ్యవహరించినప్పుడు ఈ ఇద్దరు మంత్రులతో మనకేంటి? తప్పించేస్తే పోతుంది కదా? అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ వ్యవహారంపై మాట్లాడిన మాటలు, సమంత విషయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో.. ఇంకా కోర్టులో ఈ వ్యవహారం నడుస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డపేరు వచ్చేసింది. దీనికితోడు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జూపల్లిపై అవినీతి, ఎక్సైజ్ శాఖ విషయంలో తీవ్ర ఆరోపణలే వచ్చాయి.
వార్నింగ్..
మరోవైపు తొలిసారి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలపైనా జనం గుర్రుగా ఉన్నారని సదరు సర్వే తేల్చింది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు కలవడానికి రాగా పలువురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కూడా. తాను మారానని, మీరు కూడా మారాలని కూడా హితబోధ చేశారు. అంతేకాదు ఎవరి పనితీరు ఏంటి? అనేది అందరి రిపోర్టులు తన దగ్గరున్నాయని, తన రిపోర్టుతో సహా అన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కూడా చెప్పకనే చెప్పేశారు రేవంత్. దీనికి తోడు పనితీరు మార్చుకోవాలంటూ సర్వే రిపోర్ట్ సీల్డ్ కవర్‌లో ఉంచి రేవంత్ హితబోధ చేశారని తెలిసింది. ఇది ఎంతవరకూ కరెక్టో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.