గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రాబోతోన్న గేమ్ చేంజర్ సినిమా కనుక ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల కంటే ముందు కనుక వచ్చి ఉంటే.. ఒక పార్టీకి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని అన్నారు నటుడు 30 ఇయర్స్ పృథ్వీ. జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోన్న గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో 30 ఇయర్స్ పృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన స్పీచ్ మొదలు పెట్టే ముందే మాజీ సీఎం జగన్‌ని అనుకరిస్తూ.. స్టార్ట్ చేసిన పృథ్వీ.. రీసెంట్‌గా ఓ సినిమాలో అపోజిషన్ లీడర్ పాత్రలో నటించానని, అందులో ఇప్పుడు పవర్‌లో లేము.. 11 మాత్రమే వచ్చాయి అని సెటైర్ వేశారు. జనసేనకు జై కొట్టిన పృథ్వీ.. పవన్ కళ్యాణ్ మా దేవుడు అని అన్నారు. ఏపీ పాలిటిల్స్‌లో గేమ్ చేంజర్ మరెవరో కాదు పవన్ కళ్యాణే అని అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా గేమ్ చేంజర్ అని చెప్పుకొచ్చారు.
గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇందులో ఎస్.జె. సూర్య పక్కన తన క్యారెక్టర్ ఉంటుందని, చాలా మంచి రోల్ చేశానని చెప్పారు. గేమ్ చేంజర్ సినిమా విడుదలైన తర్వాత ఏపీలో చాలా మార్పులు వస్తాయని అన్నారు. ప్రస్తుతం పృథ్వీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.