ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఒక రేంజిలో పెరిగిపోయిందనే దానికి చక్కటి ఉదాహరణే ఈ ఘటన. ఏకంగా హోం మంత్రి పీఏ అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుంది..? పోనీ ఇంత జరుగుతున్నా కనీసం మంత్రికి తెలియకుండా జరుగుతుందా..? మంత్రి ప్రమేయం లేకుండానే ఇదంతా నడిచిందా..? ఇలాంటి వాళ్ళు ఇంకా ఏయే శాఖల్లో ఉన్నారు..? మళ్ళీ గెలుస్తామో లేదో..? పోనీ గెలిచినా సరే మంత్రి పదవి వస్తుందో..? రాదో..? అని పీఏల రూపంలో అవినీతి బాగోతానికి తెరదీశారా..? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే ఇదంతా అక్షరాలా నిజమే అని మాటలు ప్రజలు, మేధావుల నుంచి వస్తున్న పరిస్థితి.
ఊహించని చిక్కుల్లో..!
హోం మంత్రి వంగలపూడి అనిత ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పీఏ సంధు జగదీష్‌పై వేటు పడింది. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సెటిల్‌మెంట్ దందాలు కూడా చేస్తున్నారని కూడా పలువురు ఆరోపించారు. ఆఖరికి పాయకరావుపేట నియోజకర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనితను కలవడానికి వెళ్లిన సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.
అనిత తర్వాత నేనే..!
ఈ క్రమంలోనే మంత్రి అనిత తర్వాత తానే అన్నట్టుగా జగదీష్ వైఖరిపై టీడీపీ క్యాడర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే జగదీష్‌పై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ హోం మంత్రి అనిత మాత్రం వాటిని అస్సలు పట్టించుకోలేదు. హోం మంత్రి అండతోనే జగదీష్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాడని సొంత పార్టీ, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం తెరమీదకు వచ్చింది. అయినప్పటికీ అనిత వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో జగదీష్ వ్యవహారంపై ప్రభుత్వానికి, టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చేసేదేమీ లేక జగదీష్‌ను హోం మంత్రి పీఏ పోస్టు నుంచి తొలగించడం జరిగింది.
అసలే లేనిపోని ఆరోపణలు.. ఆపై!
అసలే కూటమి కార్యకర్తలు, నేతలు, మంత్రులు వాళ్లకు సంబంధించిన మనుషులు ఎక్కడ దొరుకుతారా..? అని ప్రత్యర్థులు, మీడియా డేగ కన్ను వేసింది. ఇప్పటికే పలువురు అక్రమాలు, అవినీతి బయటికి వచ్చింది. ఇక వాస్తవానికి అనిత హోం శాఖ దక్కించుకున్నప్పటి నుంచి న్యాయం చేయట్లేదని, శాఖ పరంగా ఇంకా ఏ మాత్రం పట్టు సాధించలేదని, శాంతి భద్రతలు సరిగ్గా లేవని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు.
జాగ్రత్తగా లేకపోతే ఎలా..?
అసలే పరిస్థితులు బాగోలేనప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. ఇలాంటి పనులతో ఆగమాగం కావాల్సిన పరిస్థితి. వరుస ఆరోపణలు అంతకు మించి వివాదాల నేపథ్యంలో పీఏ సంధు జగదీశ్ బాగోతం బయటపడింది. దీనికి తోడు ఫిర్యాదులు వచ్చినా కనీసం స్పందన లేకపోవడం, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే గానీ సమస్యకు పరిష్కారం లభించని పరిస్థితి. అతని అక్రమాలు మంత్రికి తెలియకుండా ఉంటాయా? అంటూ ప్రజలు, మేధావులు నిలదీస్తున్నారు. ఇప్పుడు మంత్రి మీడియా ముందుకు వచ్చి ఏం చెబుతారో చూడాలి మరి. రేప్పొద్దున అనిత మంత్రి పదవి పోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే ప్రచారం కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.