అవును అది నేనే.. ఇదీ నేనే అంటూ చెప్పుకునే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే అత్యంత సీనియర్ లీడర్, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు తీరుపై రాజకీయ విశ్లేషకులు, రాష్ట్రంలోని మేధావులు విస్తుపోతున్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చి మరీ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఆఖరికి శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఉదహరిస్తూ సొంత క్యాడర్ కూడా అసంతృప్తి, అంతకు మించి ఆవేదన వెళ్లగక్కుతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఇక మాటల్లో చెప్పనక్కర్లేదు. అసలు ఇదే ఛాన్స్ ఇంకొకరికి వస్తే నిమిషం కూడా ఆలోచించకుండా లడ్డూల తినేసేవారు అంటూ కొందరు మంత్రులు, తెలుగు తమ్ముళ్లు కక్కలేక, మింగలేక మాట్లాడుకుంటున్నారు.
ఇదీ అసలు సంగతి..
వైఎస్ జగన్ లడ్డూల దొరికాడు.. మేం అరెస్ట్ చేయాలి, ఇంకేదో చేయాలంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే చేసే వాళ్ళం అని న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా మీట్ సందర్భంగా మాట్లాడిన మాటలు. ఐతే తాము వైఎస్ జగన్ రెడ్డిలాగా కక్ష్య తీర్చుకోమని, ఒక పద్ధతి విధానం అనుసరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మాటలే కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నేతలలో మంటలు పుట్టిస్తున్నాయి. ఎంతలా అంటే తిరుమల లడ్డూ విషయంలోనే ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు.. ఇప్పుడు సెకీ ఒప్పందాల విషయంలో అడ్డంగా దొరికిపోయినా ఏమీ చేయలేదు ఎందుకనీ? అదానీతో జరిగిన ఒప్పందాల్లో భాగంగా 1750 కోట్ల రూపాయలు ముడుపులు దక్కాయని ఆరోపించారు. అమెరికా కోర్టులు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? అదానీ మనకు అంత ముఖ్యమా..? లేదంటే వైఎస్ జగన్ అవసరం ఏమైనా ఉందా..? అంటూ చంద్రబాబుపై కన్నెర్రజేస్తున్న పరిస్థితి. కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు బయటికి కనపడినా.. ఇంకొందరు ఏదో ఒక రూపంలో కక్కేస్తున్నారు.
ఎందుకనీ బాబూ..?
అదానీతో వ్యవహారాలు అంటే రాష్ట్రాలకు రాష్ట్రాలే భయపడి పోతున్న పరిస్థితి. అంతే కాదు దేశాలు, రాష్ట్రాలు ఇప్పటి వరకూ అదానీ కంపెనీలతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు డీఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇప్పటివరకూ చేసుకున్న ఒప్పందాలు అన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. ఆఖరికి యూనివర్సిటీ కోసం అదానీ ఇచ్చిన కోట్ల రూపాయలను కూడా వెనక్కి ఇచ్చేశారు. మరోవైపు గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్నా, అధిక ధరల కారణంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ దక్కించుకున్న వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టును రద్దు చేశారు. ఏ మాత్రం మొహమాటానికి పోకుండా రద్దు చేసి, మళ్ళీ కొత్తగా టెండర్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.
లడ్డూ ఏమైనట్టు..?
లడ్డూల అవకాశం దొరికిందని చెప్పడం కాదు అదానీ ఒప్పందాల వ్యవహారం దొరికింది కదా ఎందుకు లంచాల వ్యవహారంలో జగన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు సాహసం చేయట్లేదు? ఎందుకనీ జగన్ అన్నా.. అదానీ అన్నా చంద్రబాబు సైలెంట్ అవుతున్నారు..? అసలు లంచాలు అనేది జరగలేదా..? కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో జగన్ రెడ్డిని టచ్ చేయాలన్నా, అంతకు మించి అదానీకి సంబందించిన ఏదైనా ఒప్పందాలు రద్దు జరగాలన్నా మనసు రావట్లేదు ఎందుకనీ? లడ్డూ సరిగ్గా వాడట్లేదా..? మింగేశారా.. పాచిపోయిందా? అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం.. సోలార్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి)తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతోందని కార్యకర్తలు మొదలు నేతలు, ఎమ్మెల్యేలు ఆఖరికి చంద్రబాబు కూడా ఆరోపించారు.
ఆలస్యం ఏల..?
అటు అదానీ లంచాల వ్యవహారంలో.. ఇటు ఒప్పందాల విషయంలో ఎందుకు మౌనం..? స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాపించిన విషయాన్ని గుర్తు చేసుకుని మరీ బాధ పడుతున్నారు కార్యకర్తలు. జగన్ సంగతి ఎప్పుడు చూస్తారు..? ఇంకెన్ని రోజులు అంటూ క్యాడర్ ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఐతే ఉన్నాయ్. ఎందుకంటే ఈ విషయం స్వయానా పార్టీ నేతలు, క్యాడర్ నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉందని చెప్పకనే చెప్పారు. దీంతో ఇంత చేసిన జగన్ రెడ్డిని ఎందుకు టచ్ చేయడానికి సాహసించరు..? అసలు జగన్ అంటే ఎందుకు అంత బెరుకు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎంను, అదానీతో ఒప్పందాల విషయంలో చంద్రబాబు అడుగులు ఎటు పడతాయో..? ఏం జరుగుతుందో చూడాలి మరి.