ఓజీ వద్దే వద్దు.. శ్రీ శ్రీ ముద్దు అని అన్నది ఎవరో కాదు స్వయానా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మధ్య పవన్ ఎక్కడికెళ్లినా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు కొత్త సినిమా ఓజీ.. ఓజీ అని నినాదాలు చేయడం పరిపాటిగా అవుతోంది. ఎంతలా అంటే మీ పని మీరు చేసుకోండి.. నా పని నేను చేసుకుంటాను అని అసహనం వ్యక్తం చేసేంత. అంతేకాదు దయచేసి పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టొద్దని ఓజీ నిర్మాతలు కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఐనా సరే అభిమానులు మాత్రం అస్సలు మారట్లేదు.
దయచేసి అనొద్దు..!
గురువారం విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ తర్వాత ప్రసంగం చేస్తుండగా ఓజీ ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ఇక చిరాకు ఎత్తున పవన్ దయచేసి ఓజీ అనడం మానుకొని శ్రీ శ్రీ అనాలని సూచించారు. అంతేకాదు ఈ సందర్భంగా అభిమానులకు క్లాస్ తీసుకోవడంతో పాటు కీలక, ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని చెప్పుకొచ్చారు.నేను మీకు ప్రాణం అయితే, నాకు పుస్తకాలు అంటే ప్రాణం అని పవన్ స్పష్టం చేశారు.
పుస్తకం రాస్తా..!
నాకు పుస్తకం చదివి అర్థం చేసుకోవడం తెలుసు. భగవంతుని ఆశీస్సులు ఉంటే ఒక పుస్తకం రాస్తాను. సూర్య నాగేంద్రుని నిఘంటువు మళ్లీ ముద్రించాలని ఉంది. నేను కొంత భరిస్తా, ప్రభుత్వం కూడా సహకారం ఇవ్వాలని కోరతానని మనసులోని మాటను బయటపెట్టారు. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. దీంతో అరుపులు కేకలతో కాకుండా కాస్త జీవితం, పుస్తకాలపై అయినా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అభిమాన హీరో, లీడర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అలానే ప్రవర్తిస్తే తప్పు కదా..! ఇకనైనా ఆయన పాల్గొనే కార్యక్రమాలకు, రాజకీయ ప్రసంగాలకు అడ్డు తగలకుండా కనీస ఇంకిత జ్ఞానంతో కార్యకర్తలు, అభిమానులు అంటారేమో చూడాలి మరి.