జేసీ తాత వచ్చాడే.. బీజేపీని బెదరగొట్టాడే!
రాయలసీమ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ రూటే సపరేటు. ఫ్యాక్షన్ మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఆరితేరిన కుటుంబం. ఐతే ఇదంతా నాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉన్నది. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయడానికి సాహసించరు అంతే. అంతే కాదు ఈ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా.. ఆఖరికి అధికారంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ, ప్రభుత్వంపై సైతం కన్నెర్రజేస్తూనే ఉంటారు. నాటి ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నిన్నటి వైఎస్ జగన్, ఇప్పటి చంద్రబాబు కూడా వీళ్ళను పెద్దగా పట్టించుకోరు.
అప్పుడు.. ఇప్పుడు..!
జేసీ ఫ్యామిలీలో దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి నిన్న మొన్నటి వరకూ బాగా స్ట్రాంగ్ గానే ఉన్నారు. వయసు రీత్యా దివాకర్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇప్పుడిక సీమ రాజకీయాలు, ముఖ్యంగా అనంతపురంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం, రాద్దాంతంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సొంత పార్టీని తిట్టిపోయాలన్నా, ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టాలన్నాఆయనే స్టయిలే వేరు. ఇంకా చెప్పాలంటే తాతా వస్తాడే అదరగొట్టి పోతాడే.. బెదరగొట్టి పోతాడే అన్నట్టుగా ఉంటుంది ఈయన వాలకం. నిన్న మొన్నటి వరకూ వైసీపీపై ఏ రేంజిలో విమర్శలు, ఆరోపణలు చేశారో అందరూ చూసే ఉంటారు.. వినే ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీని టార్గెట్ చేశారు.
అసలేం జరిగింది..?
న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి జేసీ పార్కులో వేడుకలు ఘనంగానే నిర్వహించారు. డీజేలు, డ్యాన్సులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గట్టిగానే చేశారు. ఐతే అంతకు ముందురోజు సినీ నటి, బీజేపీ నేతలు మాధవీ లత, యామినీ సాధినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనుబంధ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి కూడా. ఎంతలా అంటే తాడిపత్రిలో మహిళలకు రక్షణ లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఈ విమర్శల నేపథ్యంలోనే న్యూ ఇయర్ జరగాల్సినది, జరిగిపోయింది. ఆ మరుసటి రోజే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జేసీ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఆపి ఉన్న బస్సులో మంటలు చెలరేగి ఒక బస్సు పూర్తిగా కాలిపోగా, ఇంకో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నది. దీంతో న్యూ ఇయర్ వేడుకలు వద్దన్న, అడ్డుకోవాలని చూసిన బీజేపీ నేతలే ఈ పనికి ఒడిగట్టారని జేసీ ఒంటికాలిపై లేచారు.
మీ కన్నా జగనే మేలు కదరా!
మీ (బీజేపీ నేతలు) కన్నా జగనే మేలు కదరా..? థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా? అంటూ టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీకంటే మంచోడు.. జగన్ నా బస్సులు ఆపగలిగాడు అంతే మీ బీజేపీ ప్రభుత్వం చేతకాని కొడుకుల లాగా బస్సు తగలబెట్టింది. నేను ఏమైనా మీకు భయపడతా అనుకుంటున్నారా..? సిగ్గులేని నా కొడకల్లారా..? 300 బస్సులు పోయినప్పుడే ఏడవలేదు.. బాధపడలేదు? ఒక్క బస్సు కాలిపోయినంత మాత్రాన నాకేం అవుతుంది? నేనేం బాధపడను.. అవసరం ఐతే బస్సులన్నీ తగలబెట్టండి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం, బీజేపీ వేస్ట్ అంటే వేస్ట్ అని డైరెక్టుగా చెప్పేసారు అంతే అన్నమాట. ఇక జగన్ బెస్ట్ అని ఒకటికి రెండు మూడు సార్లు జేసీ అనడం ఆలోచించాల్సిన విషయం.
అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం కూడా?
వైసీపీ నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ ఒక్క మాట అంటే చాలు పోలోమని మీడియా ముందుకు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆఖరికి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా సైలెంట్ అయ్యారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తిట్టి పోసే కమలనాథులు.. జేసీ మాటల దెబ్బకు ఒక్కరంటే ఒక్కరూ నోరు మెదపకండా ఉండిపోయారు. ఎంతలా అంటే కనీసం ఖందించడానికి కూడా ధైర్యం సరిపోలేదు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉన్నా, ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నా.. ఏపీ మంత్రివర్గంలో బీజేపీ వాళ్లు ఉన్నప్పటికీ జేసీని టచ్ చేయలేక పోతున్నారు.
ఎవరి హస్తం ఉన్నట్టు..?
మొన్నటికి మొన్న ఫ్లై యాష్ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఎంత రచ్చ జరిగిందో రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆఖరికి ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా కనీసం తేల్చలేని పరిస్థితి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కస్సుబుస్సులు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ బేడుకలపై బీజేపీ విమర్శలు చేయడం మరుసటి రోజే బస్సు తగలబడటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు అనంతపురం జిల్లాలో బీజేపీకి అంత క్యాడర్ కూడా లేదు. ధర్మవరం నుంచి గెలిచి, మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి మాత్రమే చెప్పుకోదగ్గ లీడర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ కాకుండా జేసీ ఫ్యామిలీని టచ్ చేసింది ఎవరు? పోనీ వైసీపీ నేతలు ఎవరైనా ఉన్నారా అంటే.. ఈ అనుమానాలకు ముందే వాళ్ళు అంత సాహసం చేయరని ప్రభాకర్ రెడ్డే చెప్పడం గమనార్హం. ఇప్పుడిక ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు..? పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? అనేది తెలియట్లేదు. ఈ రచ్చపై సీఎం చంద్రబాబు, బీజేపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? జేసీ నుంచి ప్రతి స్పందన ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.