టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అరెస్ట్‌కు ముందు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై బీఆర్ఎస్, వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతున్న మాటలు అటు ఇండస్ట్రీని, రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశాయి. సినీ పరిశ్రమను సపోర్టు చేస్తూ, బన్నీ అరెస్టును తీవ్రంగా ఖండించినప్పటికీ.. ఈ రెండు వ్యవహారాలను తమకు అనుకూలంగా, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సువర్ణావకాశంగా మలుచుకుని విమర్శించారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. కేటీఆర్‌పై ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు.
దాపరికం ఏముంది?
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని మీతో పాటు అందరికీ తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది.
కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు ప్రకటనలో మంచిగా, మర్యాదపూర్వకంగానే మాట్లాడుతూ గట్టిగానే ఇచ్చిపడేశారు.