తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, ఏలిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ తర్వాత పత్తా లేకుండా పోయింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 11 ఏళ్లుగా అడ్రస్ లేని టీడీపీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్, వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అది కూడా ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఇరువురూ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లతో రెండు దఫాలుగా కూడా అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నుంచే పార్టీ బలోపేతం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు అన్నీ ఇక్కడ్నుంచే మొదలుపెట్టాలని, సామాజిక వర్గం కలిసొస్తుందని చంద్రబాబు కూడా ఖమ్మం వైపే మొగ్గు చూపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఏం చేస్తారు?
మొదట ఉమ్మడి ఖమ్మం లేదా మహబూబ్ నగర్ నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశంకై పార్టీ అధిష్టానం కసరత్తు షురూ చేసింది. ఈ రెండు జిల్లాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తలు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. రెండు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏ మేరకు పార్టీని ఆదరిస్తారు? అసలు టీడీపీ పార్టీని గుర్తించే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? మరిచిపోయారా? అని లోతుగా గ్రౌండ్ వర్క్ చేసిన ఆ ఇద్దరూ.. చంద్రబాబు, లోకేశ్‌కు డిటెయిల్డ్ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఖమ్మం జిల్లా రికార్డు స్థాయిలో కావడం, తొలి స్థానం రావడంతో చంద్రబాబు ఎంతో హ్యాపీగా ఉన్నారట. స్థానిక సంస్థలే లక్ష్యంగా ముందుకెళ్లాని బాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంక్ కమ్మ సామాజికవర్గం అని తెలిసిందే. అందుకే ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి జిల్లాల్లో సామాజికవర్గం గట్టిగానే ఉంది. ఈ క్రమంలోనే పూర్వ వైభవం కోసం చంద్రబాబు వ్యూహ రచనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్‌కు మంచి రోజులు?
వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టిన ప్రతిసారీ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదేనబ్బా సైకిల్ గుర్తుపై పోటీచేసిన ప్రతిసారీ కారు గుర్తుదే పైచేయి కావడం ఆనవాయితీగానే వస్తోంది. ఇందుకు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే చక్కటి ఉదాహరణలు. ఎందుకంటే టీడీపీ అడ్రస్ లేకుండా పోయిన తర్వాత రెండుగా విడిపోయిన టీడీపీ క్యాడర్ మొదలుకుని నేతల వరకూ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నోళ్లే. ఆ తర్వాత 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతలు ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ రీ ఎంట్రీ అంటే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అంటూ రాజకీయ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్న పరిస్థితి. కచ్చితంగా కారు పార్టీకి మంచిరోజులు వచ్చినట్లేనని చెప్పుకుంటున్న పరిస్థితి.
రేవంత్ ఏం చేస్తారో?
సీఎం రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగినది అయితే, రాజకీయ గురువు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తానంటే పరిస్థితేంటేన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బీఆర్ఎస్, బీజేపీలను అణగదొక్కేందుకే గురు శిష్యులు ఇద్దరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏతో జతకట్టి, ఎన్నికలకెళ్లి గెలిచి నిలిచాయి. ఇప్పుడు శిష్యుడిని కాదని, బీజేపీతో జతకడుతారా? పోనీ బీజేపీ పక్కనెట్టి కాంగ్రెస్‌తో జతకడతారా అంటే కష్టమే. పోనీ ఒంటరిగా పోటీ చేయడానికి సాహసం చేస్తారా? అంటే ఇప్పటి వరకూ అలా అడుగులేసిన చరిత్రే లేదు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ వేరే పార్టీల సపోర్టు లేకుండా టీడీపీ ఎన్నికలు వెళ్లిన దాఖలాలు లేవు. అటు కాంగ్రెస్‌తో జతకడితే బీజేపీకి కోపం.. పోనీ బీజేపీతో జతకడితే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తలనొప్పే. ఇవన్నీ కాదు జనసేన-టీడీపీ కలిసి పనిచేస్తాయా అంటే అదీ అసాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? దీనికంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవర్ని నియమిస్తారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.