ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఫలితాలు వచ్చిన మరుసటి రోజు మొదలైన రాజీనామాలు నాన్ స్టాప్ అంటూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీ మంత్రులు పార్టీని వీడారు. ఇప్పుడిక ఎన్నికల్లో అడుగుపెట్టి ఓటమిని చవి చూసిన నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. పార్టీకి మాత్రమే కాదు శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతూ ఉండటం గమనార్హం. తాజాగా ఈ జాబితాలో మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కూడా చేరిపోయారు.
రాజకీయాలకు దూరం..
కలెక్టరుగా పనిచేసిన ఇంతియాజ్ తనకంటూ మంచి గుర్తు తెచ్చుకున్న ఆయన ప్రజాసేవ చేయడానికి సిద్ధమవ్వగా సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కండువా కప్పుకున్నారు. కర్నూలు సిటీలో మైనార్టీ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్. ఐతే టీడీపీ తరఫున పోటీ చేసిన టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఐతే ఓడిన కొన్ని నెలల వ్యవధిలోనే రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించడం వైసీపీ కార్యకర్తలు, నేతలు విస్మయానికి గురయ్యారు. శుక్రవారం నాడు వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
లేఖలో ఏముంది..?
కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలుసు. గత కొంత కాలంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేమిటంటే రాజకీయ రంగం నుంచి దూరంగా జరగటం, రాజకీయాలకు దూరం అవుతున్నాను. కానీ ప్రజసేవ రంగానికి కాదు. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఏఐఎస్ అధికారిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా ఒక మెరుగైన సమాజం కోసం, నా వంతు కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. గత ఆరు నెలల కాలంలో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో సామాజిక అసమానతలను, రుగ్మతులను రూపుమాసేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ఆ దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో పని చేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇంతియాజ్ లేఖలో పేర్కొన్నారు.