అవును.. మాజీ మంత్రి రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరోక్ష వ్యాఖ్యలు అటు వైసీపీలో ఇటు జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఇప్పట్నుంచి కాదు.. చాలా రోజులుగా ఉన్నవే. అందుకే వైసీపీ హయాంలో తొలి టెర్మ్‌లో మంత్రి పదవి కూడా రాలేదన్నది జగమెరిగిన సత్యమే. రెండోసారి కూడా మంత్రి పదవి రాకుండా ఉండటానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ శతవిధాలుగా ప్రయత్నించినా సరే అడ్డుకోలేకపోయిందన్నది నాటి నుంచి నేటి వరకూ నడుస్తున్న పెద్ద చర్చ. ఆ మధ్య ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అటు రోజా.. ఇటు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి రియాక్షన్ వచ్చినా, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దీనికి తోడు గురువారం నాడు నగరి నియోజకవర్గం వేదికగా జరిగిన సమావేశంలో రోజా మాట్లాడుతూ పరోక్షంగా పెద్దిరెడ్డిపై గట్టిగానే ఫైర్ అయ్యారు.
ఇంత మాట అన్నారేంటో?
వైసీపీలోనే కొందరు చేసిన దిగజారుడు రాజకీయాల వల్ల ఎప్పుడూ అత్యధిక స్థానాలు గెలిచే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి గెలవలేకపోయామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా భుమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పంతో సహా 14 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాస్త లోతుగా ఆలోచిస్తే గతంలో చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డే చూసుకున్నారు. దీనికి తోడు వేదికపైన ఉన్న నేతల్లో భూమన, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు ఇతర నేతలు ఉన్నారు. ఇక లేనిది పెద్దిరెడ్డి మాత్రమే. పైగా వైసీపీలో ఆయన ఎంట్రీ ఇచ్చింది మొదలుకుని ఇప్పటి వరకూ జిల్లాలో ఆయనదే పైచేయి కూడా. ఇవన్నీ ఒకెత్తయితే భూమన ఆధ్వర్యంలో కుప్పంతో 14 స్థానాలు గెలుస్తామని చెప్పడంతో, పెద్దిరెడ్డి అధ్యక్షతన గెలవలేకపోయామని పరోక్షంగా చెప్పేసినట్లే కదా? అని జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీంతో పెద్దిరెడ్డి వర్గం రోజాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అయినా పెద్దిరెడ్డి సమయం, సందర్భంను బట్టి చూసి గట్టి దెబ్బే కొడతారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు చెప్పుకుంటారు.
ఏం చేస్తారో చేసుకోండి..
ఇక ఇదే సమావేశంలో టీడీపీ కూటమి సర్కార్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెడతావా, పెట్టుకో? కేసులు పెడతావా పెట్టుకో? ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది వడ్డీతో సహా తిరిగి ఇస్తాంనని రోజా ఒకింత ఛాలెంజ్ చేస్తూ చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన కార్యకర్తల పేర్లను గుడ్ బుక్‌లో రాసి, వారిని గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేశారు. నాడు ఎన్నికల ముందు ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు, వైసీపీని దించేంతవరకు కంకణం కట్టుకొని పనిచేశారని, కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయే తప్ప, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాలేదని రోజా ఆరోపించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తప్పులు చేసి ఓడిపోలేదన్నారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దొంగల్లా మారిందని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలకు నరకం అంటే ఏంటో కూటమీ ప్రభుత్వం చూపిస్తోందని, జగన్‌ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ, పశ్చాత్తాప పడుతున్నారని రోజా చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ బిజినెస్‌మెన్‌గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీమెన్‌గా సక్సెస్ అయిన వ్యక్తని రోజా చెప్పుకొచ్చారు.