టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ గురుంచి ఎక్కడ చూసినా చర్చించుకుంటున్న పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల.. ప్రముఖులు అంతా వెళ్లి పరామర్శ, మీడియా సమావేశాలు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, బన్నీ మళ్ళీ ప్రెస్ మీట్, కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్, ఏంఐఎం నేతలు మాట్లాడటం, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు, టమోటాలతో దాడి ఘటనలు టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సినీ పెద్దలు ఒక్క అడుగు ముందుకు వేశారు.
ఇదీ అసలు సంగతి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను సినీ పెద్దలు కలవబోతున్నారు. రెండు లేదా మూడు రోజుల్లో అమరావతి వేదికగా ఈ భేటీ జరగబోతోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా సినీ ప్రముఖులు కోరారు. ఇదిలా ఉంటే గతంలోనే డిప్యూటీ సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలోనూ సర్వత్రా ఉత్కంఠ.. అంతకు మించి ఆసక్తి నెలకొంది.
ఎవరెవరు.. ఏం చర్చిస్తారు..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, నిరంజన్ రెడ్డి, బన్నీ వాసు, దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులు కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కీలక భేటీలో ఇండస్ట్రీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, సినిమా టికెట్ల పెంపు, బెన్ ఫిట్ షోలు గురుంచి చర్చ జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో వీటి గురుంచి ఎక్కవగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డితో భేటీ..
ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మాట్లాడబోతున్నారు. మరోవైపు పలువురు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసే యోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. అమెరికాలో బిజీ బిజీగా ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించబోతున్నట్లు వెల్లడించారు.