గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం ఉందో.. తద్వారా మోహన్ బాబు ఎంతగా అప్సెట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల కుటుంబ గొడవలే అయినా.. అవి బయటకు వచ్చేయడంతో మీడియా కూడా శ్రద్ధ పెట్టింది. ఈ గొడవల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన మోహన్ బాబు ఓ జర్నలిస్ట్‌పై చేయి చేసుకోవడంతో.. ఆయనపై కేసు కూడా నమోదైంది.
జర్నలిస్ట్‌పై చేయి చేసుకున్న విషయంలో మంచు ఫ్యామిలీ అంతా సారీ చెప్పినప్పటికీ.. మోహన్ బాబుపై కేసు మాత్రం అలాగే ఉంది. ఈ కేసు విషయంలో ఆయన పరారీలో ఉన్నాడనేలా రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఆయనకు మధ్యంతర బెయిల్‌ని ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించలేదనేలా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఊపిరి పీల్చుకునేలా ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు జరిగింది కానీ, ఇకపై కానీ.. మోహన్ బాబు అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ వంటివి ఏవీ కూడా వాడకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఇప్పటి వరకు వారి గొడవలపై పోస్ట్ అయిన కంటెంట్ గూగుల్‌లో ఉన్నా తీసేయాలనేలా కోర్టు తీర్పుని ఇవ్వడంతో.. మోహన్ బాబుకు కాస్త ఊరట లభించినట్లయింది.