నా పని నన్ను చేయనివ్వండి.. మీ జీవితాలు చూస్కోండి!.. అవును.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభిమానులు, జనసేన కార్యకర్తలు, అనుచరులను ఉద్దేశించి పవన్ మాట్లాడిన మాటలు. ఈ మధ్య ఎందుకో ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా అభిమానులు, కార్యకర్తల పట్ల సేనాని ఎందుకో అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకు ఇంతలా చిర్రెత్తుకొచ్చే పనులు, మాటలు.. అభిమానులు ఏం మాట్లాడారు? తాజాగా జరిగిన పరిణామాలు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
నేనున్నాననీ...
శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి చెప్పులు కూడా లేకుండానే ఒట్టి కాళ్ళతో బురదలో నడిచి వెళ్లారు. సాలూరు నియోజకవర్గంలో పనసభద్రలో గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణానికి రూ. 36 కోట్ల రూపాయల వ్యయంతో 19 రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్న ఆయన చలించిపోయారు. దీంతో గిరిజనులకు ఉన్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఈ డోలీ మోతలు తప్పేలా కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని భరోసా ఇచ్చారు.
స్వీట్ వార్నింగ్..
ఈ క్రమంలో తన అభిమానులు, కార్యకర్తలకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ మాట్లాడుతుండగా.. ఓజీ, ఓజీ.. అని కాసేపు గట్టిగా అరిచారు. ఎంతలా అంటే ఆయన మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేలా గోల చేశారు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయిన పవన్.. ఎందుకు అరుస్తున్నారు..? ఓజీ.. ఓజీ అని అరిస్తే ఏం వస్తుంది..? దయచేసి అరవకండి అని కోపంగా చెప్పారు. అంతే కాదు నన్ను పని చేసుకోనివ్వండి అంటూ గట్టిగా ఇచ్చి పడేశారు. ఈ క్రమంలో మరికొందరు సీఎం సీఎం.. అని అరవడం మొదలు పెట్టారు.. మరోసారి అంతే రీతిలో పవన్ స్పందించాల్సి వచ్చింది. నేను డిప్యూటీ సీఎం అనే విషయం మరిచిపోయి ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు ఎందుకు? ఇదేం పద్ధతి? ఇది ఏ మాత్రం సరైంది కాదు అని అభిమానులకు హితవు పలికారు పవన్.
ఇక అన్నీ మానండి!
సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టడం కాదు, మీ జీవితాల మీద దృష్టి పెట్టండి అని సూచించారు సేనాని. ఇక మాట్లాడితే అన్నా మీసం తిప్పు.. మీసం తిప్పు అని కొందరు అభిమానులు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్న పవన్.. నేను మీసం తెప్పితే రోడ్లు పడవు..? చాతీ మీద కొట్టుకుంటే రోడ్లు పడవు..? నేను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఇదీ పరిస్థితి అని చెబితేనే రోడ్లు పడతాయని ఒకింత కోపంతో చెప్పారు పవన్. అందుకే ఇక అరుపులు, కేకలు, ఈలలు, గోలలు వద్దని.. నా పని నన్ను చేయనివ్వండి అంటూ అభిమానులకు పవన్ సూచించారు.
నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు!
ఇక ఈ పర్యటనలో భాగంగా 2019లో తన ఓటమిని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు పరోక్షంగా వైఎస్ జగన్ రెడ్డిపై ఆయన సెటైర్లు వేశారు. 2019లో నన్ను గెలిపించలేదు, పరీక్షించారు. నిలబడతాడో లేదో నన్ను పక్కనపెట్టేశారు. అది కూడా ఒక అందుకు మంచిదేనని చెప్పుకొచ్చారు పవన్. ఇక బుగ్గలు నిమరడం, తల నిమరడం నాకు తెలియదు, మీ కన్నీళ్లు చూసి పారిపోను అని పవన్ వ్యాఖ్యానించారు. ఐ లవ్ యూ అంటూ గిరిజనులకు పదే పదే చెప్పారు. తన పిల్లలకు కూడా మీకు చెప్పినన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పలేదని వారితో సరదాగా గడిపారు.
రుణపడి ఉంటా..!
నేనెప్పుడూ గిరిజనులకు రుణగ్రస్తుడినే. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే ప్రశ్నించండి, ప్రశ్నించేతత్వం అలవర్చుకోండి అంటూ గిరిజనులకు పిలుపునిచ్చారు. గతంలో ఏ ఒక మంత్రి ఈ ప్రాంతాలకు రాలేదు.. కానీ డోలీ మోతలు కష్టాలు విని నేను ఇంతదూరం వచ్చాను. గత ప్రభుత్వం 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలస్ నిర్మించుకుంది. కానీ, మీ ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీకోసం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారు. మీ కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు నేనే కొండపైకి నడిచి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇకపై రెండు, మూడు నెలలకోసారి ఇక్కడికి వస్తుంటాను అని గిరిజనులతో పవన్ చెప్పారు.