బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మెడకు ఫార్ములా-ఈ రేస్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా.. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు అయ్యింది. ఫెమా ఉల్లంఘన, మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అర్వింద్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి అన్నారు. ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసును నమోదు చేయడం జరిగింది.
ఎక్కడ చూసినా ఇదే రచ్చే!
గురువారం సాయంత్రం నుంచి ఎక్కడ చూసినా ఇదే చర్చ.. అంతకు మించి రచ్చ. అసెంబ్లీలో చర్చిద్దాం అని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఐతే తాను ఏ మాత్రం తప్పు చేయలేదని.. మా వెంట్రుక కూడా పీకలేరని రేవంత్ సర్కారుకు ఛాలెంజ్ చేసిన పరిస్థితి. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని కారు పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. మేం కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధం అని నేతలు చెబుతున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని నేతలు మండిపడుతున్నారు.
అవును.. నన్ను కలిశారు.
ఫార్ములా ఈ-రేస్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై చర్చించాలని బీఏసీలో ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు. మూడు నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోందని, ప్రమాణస్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు తనను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్. కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని కూడా తనతో చెప్పారని, తనను కలిసిన వాళ్లతో ఫొటో దిగుతుంటానని.. అలాగే ఎఫ్ఈవో వాళ్లతో కూడా ఫొటో దిగానని రేవంత్ స్పష్టం చేశారు. వీళ్ల ఒప్పందం రూ.600 కోట్లు ఐతే.. ప్రభుత్వం మారడంతో రూ.55కోట్లతో ఆపామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టం చేశారు.
ఎక్కడో తేడాగా ఉంది..
అసెంబ్లీలో కేటీఆర్ కూడా మాట్లాడారు. సీఎంకు సమాచారం లోపం ఉందని, ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తనపై కేసు నిలవదనీ, లీగల్‌గా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పొన్నం అవినీతి జరగలేదంటున్నారు, ఇంకా ఏసీబీ కేసు ఎందుకు? మంత్రిగా నేను ఫార్ములా ఈ-రేస్ విషయంలో విధాన నిర్ణయం తీసుకున్నాను. డబ్బులు పంపిన విధానం తప్పు అని పొన్నం అంటున్నారు. ఈ కేసులో ఏసీబీకి కేసు పెట్టే అర్హత లేదు. ఈ కేసులో అరపైసా అవినీతి జరగలేదు. సభలో ప్రభుత్వం తప్పులను హరీష్ రావు బయటపెట్టినందుకు సిట్ వేశారు. రేవంత్ కింద పనిచేసే సిట్‌తో న్యాయం జరగదు.ఓఆర్ఆర్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కోకాపేట భూములపైన కూడా సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరపాలి. నన్ను ఏ కేసులో జైలుకు పంపాలో కూడా ప్రభుత్వానికి అర్థం కావడంలేదని కేటీఆర్ చెప్పడం గమనార్హం.