తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో గులాబీ పార్టీలో పెద్ద గందరగోళమే నెలకొందట. ఒకటా రెండా సమాధానం లేని సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అటు బీఆర్ఎస్ పార్టీలో.. ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్స్ వింటే బాబోయ్ ఏంటి ఇది..? అని ఆశ్చ్యపోతారు అంతే. వీటిని కొందరు కారు పార్టీ కార్యకర్తలు, నేతలు కొట్టి పారేస్తున్నా.. హస్తం పార్టీ కార్యకర్తలు మాత్రం అవును ఇదే అక్షరాలా నిజం అని చెప్పుకుంటున్న పరిస్థితి.
ఏ జైలుకు..?
సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ అరెస్టుపై చిత్ర విచిత్రాలు చర్చ నడుస్తోంది. చిన్న బాస్ అరెస్టుపై బెట్టింగ్ అడ్డాగా తెలంగాణ భవన్ మారిందన్నది తొలి ఆరోపణ. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత చంచల్ గూడ జైలుకు తరలిస్తారా..? లేదంటే చర్లపల్లి జైలులో వేస్తారా..? అంటూ బెట్టింగ్ నడుస్తోందట. ఇక దీనికి కొందరు బదులిస్తూ బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు కాబట్టి అక్కడికే కేటీఆర్ కూడా వెళ్లొచ్చు అంటూ హడావుడి నడుస్తోంది. వాస్తవానికి గులాబీ పార్టీలో వర్గ విబేధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. కేటీఆర్, కేసీఆర్, హరీష్, కవిత అంటూ వర్గాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు.. నెట్టింట్లో ఎన్నోసార్లు తిట్టి పోసిన కార్యకర్తలు కూడా ఉన్నారు.
హ్యపీయెస్ట్ పర్సన్ ఎవరు?
కేటీఆర్ అరెస్ట్ తర్వాత కేసీఆర్ కుటుంబంలో ఒకరు మాత్రం చాలా సంతోషంగా ఉంటారని మరో పుకారు షికారు చేస్తోంది. అంతే కాదు పోలీసులు ఎప్పుడెప్పుడు వస్తారా..? ఎప్పుడెప్పుడు లాక్కొని వెళ్తారా..? ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఆ హ్యపీయెస్ట్ పర్సన్ ఎవరు..? అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అటు కేటీఆర్ అభిమానులు.. ఇటు పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారని తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే..
కేటీఆర్ అరెస్ట్ ఐతే తాము అంతా హరీష్ పక్కన ఉండాలా..? లేదంటే కవిత వైపు ఉండి ముందుకు వెళ్ళాలా..? అని తెలియక కార్యకర్తలు, అభిమానులు యమ గందరగోళంలో మునిగిపోయారట. ఇందులో నిజానిజాలు ఎంత..? ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరో అని తెగ తిట్టేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. మున్ముందు ఇలాంటి ఇంకా ఎన్నెన్ని బయటికి వస్తాయో..? ఎలాంటి రిప్లై వస్తుందో కూడా చూడాలి మరి.