మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటూ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్‌లో ఉంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరోవైపు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అనూహ్యంగా సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. విడుదల వాయిదా అని చెప్పిన తర్వాత మళ్లీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ చెప్పలేదు. దీంతో ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని సంక్రాంతి బరిలో దింపేందుకు.. చిరు తన విశ్వంభర విడుదల తేదీని త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వంభర విడుదల తేదీపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలైన ఐకానిక్ డేట్‌ని విశ్వంభర విడుదల కోసం మేకర్స్ అనుకుంటున్నట్లుగా టాక్ వినబడుతోంది.
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం మే 9 న విడుదలై చరిత్ర సృష్టించింది. ఇప్పుడదే జానర్‌లో రెడీ అవుతున్న విశ్వంభర కూడా ఆ డేట్‌కే వస్తే సెంటిమెంట్‌గా ఉంటుందని చిరంజీవి కూడా భావిస్తున్నారనేలా వార్తలు సంచరిస్తున్నాయి. అందుకే మేకర్స్ విశ్వంభర సినిమాని కూడా అదే రోజున రిలీజ్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫైనల్‌గా మేకర్స్ అధికారికంగా ఏ తేదీని ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే విశ్వంభరకు మే 9 పర్ఫెక్ట్ డేట్ అని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆషికా రంగనాధ్, మీనాక్షి చౌదరి వంటి వారు కూడా ఇతర పాత్రలలో నటిస్తున్నారు.