బిగ్ బాస్ గెలిచి ట్రోఫీ చేత బట్టి ప్రైజ్ మనీ తో విర్ర వీగుతూ బయటికొచ్చి తమకొచ్చిన ఫ్యాన్ బేస్ తో ర్యాలీలు నిర్వహిస్తూ తెగ హంగామా చేస్తారు బిగ్ బాస్ విన్నర్స్. హౌస్ లో ఉండగానే వారికి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. తమ ఆట తీరు నచ్చో, లేదంటే మారేదన్నా కానివ్వండి విన్నర్ అయ్యి బయటికొచ్చాక అభిమానులు హంగామా మాములుగా ఉండదు.
గతంలో అంటే రెండో సీజన్ సమయంలో కౌశల్ మండా కు కౌశల్ ఆర్మీ అంటూ ఫ్యాన్ బేస్ ఏర్పడి.. కౌశల్ ని ఏమైనా అంటే ఆ కౌశల్ ఆర్మీ తనీష్ లాంటి వారిని కొట్టడానికి కూడా వెళ్లారు, హోస్ట్ నాని ని భయపెట్టారు. ఇక గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి పల్లవి ప్రశాంత్ ఏకంగా జైలుకెళ్లాల్సి వచ్చింది.
అభిమానులంటూ అతి చేసే బ్యాచ్ కి ఈసారి పోలీసులు మాములుగా చెక్ పెట్టలేదు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడంతో టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్, నబీల్, ప్రేరణ, గౌతమ్ వీళ్లంతా ఓపెన్ టాప్ కార్ ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఇంటికెళితే.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాత్రం ఓపెన్ టాప్ కార్ ఎక్కినా చుట్టూ ఎవరూ లేకుండానే సైలెంట్ గా ఇంటికెళ్లి వెళ్ళిపోయాడు.
అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఛానల్స్ లో హడావిడి చేస్తూ ఇంటర్వ్యూలో కనిపిస్తాడనుకుంటే అదీ లేదు, పాపం బిగ్ బాస్ 8 విన్నర్ మాత్రం విజయాన్ని ఆస్వాదించలేకపోయాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.