అవును.. అదిగో, ఇదిగో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అరెస్ట్ అని ఇప్పటి వరకూ మాటలన్నీ వార్తలకే పరిమితం అయ్యాయి. సీన్ కట్ చేస్తే అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ- కార్ రేస్ నిధుల గోల్ మాల్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఏసీబీ కేసు నమోదు చేయడం ఇదొక పెద్ద సంచలనమే అయ్యింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను ఏసీబీ చేర్చింది. ఆయనతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. కేటీఆర్‌పై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ ఏ1, ఏ2 అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిగా ఏసీబీ పేర్కొ్న్నది. కాగా ఫార్ములా ఈ-కార్ రేసు అంశంలో కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏసీబీని ఆదేశిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతకుముందు కేబినెట్‌లో చర్చించడం అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి తీసుకోవడం, ఆ లేఖను సీఎస్‌కు రావడం, శాంతికుమారి ఆదేశించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో నిశితంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వివరాల ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది.
అన్నీ నాన్ బెయిలబుల్..
కాగా.. కేటీఆర్‌పై నమోదైన కేసులన్నీ నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం. కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే రేపు అనగా శుక్రవారం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది, ఈ మొత్తం వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంపై సభలో చర్చ పెట్టండి, అసెంబ్లీలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసు వ్యవహారంపై కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. కేటీఆర్‌పై కేసు నమోదు ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసు నమోదు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. కేటీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.