జనసేనలోకి మనోజ్, మౌనిక.. అఖిల సంగతేంటి?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రాజకీయ అరంగేట్రం ఉంటుందని పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. తొలుత టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. అప్పట్లోనే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును కూడా కలిసి, పసుపు కండువా కప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఎందుకో అదేదీ జరగలేదు. ఇప్పుడిక ఈ మధ్య ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రజాసేవ చేయాలనే తపనతో ఒక్క అడుగు ముందుకు వేయాలని మనోజ్, మౌనిక భావిస్తున్నారు.
పసుపు నుంచి ఎరుపు!
మొదట పసుపు కండువా కప్పుకోవాలని భావించినా ఆ తర్వాత ఏమైందో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడిక మనసు మార్చుకున్న మనోజ్ దంపతులు ఎర్ర కండువా అదేనబ్బా జనసేనలో చేరడానికి ఫిక్స్ అయ్యారని విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎర్ర కండువా కప్పుకోనున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఉన్న మనోజ్ దంపతులు శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి సుమారు వందల కార్లలో ఆళ్లగడ్డకు వెళ్ళారు. భూమా ఘాట్లో రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నారు.
ఎప్పటి నుంచో..!
కాగా.. మంచు ఫ్యామిలీ రాజకీయాలకు కొత్తేమీ కాదు. నాడు మంచు మోహన్ బాబు 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆ తరవాత కూడా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అంటూ పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇప్పుడిక మనోజ్ దంపతులు జనసేనలో చేరబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్పితే అన్ని పార్టీలను మంచు ఫ్యామిలీ తిరిగేసినట్టే అని చెప్పుకోవచ్చు. అంతే కాదండోయ్ గులాబీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి.. మనోజ్ ఆప్త మిత్రుడు. గత ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు.
కొత్త టర్న్..
నిన్న మొన్నటి వరకూ మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ కుటుంబంలోని వివాదాలకు ఫుల్ స్టాప్ పడలేదు. కేసులు, కోర్టులు అని నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్ పొలిటికల్ స్టెప్ తీసుకోవడం గమనార్హం. దీంతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల ఇంట్లో, బయట చోటుచేసుకున్న వరుస పరిణామాలతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
అఖిల సంగతేంటి?
భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ, నంద్యాల కంచుకోటలు. నాటి నుంచి నేటి వరకూ అలాగే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ బద్దలు కొట్టగా మళ్ళీ 2024 ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ పుంజుకుంది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక నంద్యాల నుంచి ఎన్ఎండీ ఫరూక్ గెలిచి మంత్రిగా ఉంటున్నారు. ఐతే ఈ రెండు నియోజకవర్గాల్లో అప్పటి నుంచీ ఇప్పటి వరకూ భూమా ఫ్యామిలీదే పైచేయి. అందుకే నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. మరి అఖిల సపోర్టు ఉంటుందా..? లేదా? రేపొద్దున్న నంద్యాల నుంచి అల్లగడ్డకు వచ్చి ఎసరు పెడతారనే కంగారు కూడా భూమా ఫ్యామిలీలో మొదలైందని టాక్.
మంచి పేరు..!
ఎందుకంటే మౌనికకు మంచి పేరుంది. అప్పట్లో శోభా నాగిరెడ్డి.. అంతకు ముందు శోభా నాగిరెడ్డి చనిపోయాక ఆళ్లగడ్డ, నంద్యాల ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా నిదానస్తురాలు. వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కూడా దీటుగా ఉంటారని భూమా అభిమానులు చెప్పుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అమ్మ, నాన్న చనిపోయాక ఇంటి, వ్యాపార వ్యవహారాలు అన్నీ మౌనికనే చూశారు. ఆమె వాళ్ళే కుటుంబం, వ్యాపారం కూడా నిలబడిందని కూడా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే నంద్యాల నుంచి మొదలు పెట్టి అటు నుంచి ఆళ్లగడ్డ వస్తే పరిస్థితి ఏంటన్నది అఖిల ప్రియ ఆందోళన చెందుతున్నట్లు తెలియవచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.