అవును.. ఇన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్నాయని, మెగా అనే పేరుతో తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికితోడు బన్నీ ఎదుగుదలను మెగా ఫ్యామిలీ కూడా ఓర్చుకోలేక పోతున్నట్టు ఇలా ఒకటా రెండా లేనిపోని ఆరోపణలు, విమర్శలు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం వార్తలు రాసేయడం, న్యూస్ చానల్స్, యూట్యూబ్ ఛానెళ్ళల్లో ప్రసారం చేయడం జరిగింది. ఐతే అల్లు అర్జున్ అరెస్టుతో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడింది.
అల్లుడు వచ్చాడు..!
అల్లు అర్జున్ అరెస్ట్, జైలు, బెయిల్, రిలీజ్ ఇవన్నీ పెద్ద హైడ్రామాగానే నడిచాయి. ఇక శనివారం అంతా రాజకీయ, సినీ ప్రముఖులు బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కటే సెలెబ్రిటీల తాకిడి, పరామర్శలతోనే గడిచిపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి అరెస్ట్ ఆయిన రోజు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు వచ్చారు కానీ, రిలీజ్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. చిరు సతీమణి సురేఖ (అల్లు అరవింద్ సోదరి) మాత్రం వచ్చారు. అల్లుడిని ఆత్మీయంగా కలిశారు. ఇప్పుడిక ఆదివారం రోజు మామయ్య చిరు ఇంటికి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు.
అన్నిటికీ చెక్ పడినట్టే!
మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్ రావడంతో వివాదాలు, విమర్శలకు ఇక పులిస్టాప్ పడినట్టే అని మెగాభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ చెప్పుకుంటోంది. బన్నీతో పాటు కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటన, అరెస్ట్ ఈ వ్యవహారాలపై 15 నిమిషాలుగా ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. పుష్ప 1 తర్వాత అప్పట్లో చిరు ఇంటికి వెళ్ళిన అల్లుఅర్జున్, ఆ తర్వాత ఇప్పుడు పుష్ప 2 విజయం, అరెస్ట్ తర్వాత మామయ్య ఇంటికి వెళ్ళాడు. అంతే కాదు మెగాస్టార్ కుటుంబంతో కలిసి బన్నీ లంచ్ కూడా చేయనున్నాడు. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ రద్దు చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
హమ్మయ్యా..!
మొత్తానికి చూస్తే ఇక వివాదాలు, విమర్శలు, లేనిపోని ఆరోపణలకు చెక్ పడినట్టే. ఇక అంతా ప్రశాంతం.. మామ అల్లుడు కలసిపోయారు అని బన్నీ ఫ్యాన్స్, మెగాభిమానులు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని, ఏదేదో ఇద్దరి మధ్య నడుస్తోందని హడావుడి చేసిన వాళ్ల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయో.. ఏంటో! ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ బన్నీని భుజానికి.. ఇంకా చెప్పాలంటే నెత్తికి ఎత్తుకొని హడావుడి చేసిన వైఎస్ జగన్ వీరాభిమానులు ఏమంటారో.. పొగిడిన నోటితోనే తిట్టిపోస్తారా..? లేదంటే కుటుంబ గొడవల్లో ఇకనైనా తల దూర్చకుండా సైలెంట్ అవుతారా అనేది చూడాలి.