తెలుగు రాష్ట్రాలు, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా, మీడియా వేదికగా ఆయా పార్టీల నేతలు తీవ్రంగా ఖండించగా తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
అన్యాయం..!
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై హీరో అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ వేదికగా జగన్ రాసుకొచ్చారు.
దేనికి ఈ సంకేతాలు?
అల్లు అర్జున్ అంటే వైసీపీకి విపరీతమైన ప్రేమ. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో మొదలైన ప్రేమ, సినిమా రిలీజ్ సమయానికి మరింత ఎక్కువైంది. అదికాస్త బన్నీ అరెస్టుతో ఇక అమాంతం పెరిగిపోయింది. ఇప్పటి వరకూ కార్యకర్తలు, అభిమానులు, నేతలు మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఏకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్పందించడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే హైకోర్టులో బన్నీ తరపున న్యాయవాది ఉన్నది వైఎస్ జగన్ మనిషి నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి కావడం గమనార్హం. లాయర్లు రంగంలోకి దిగడం, అభిమానులు ఎనలేని అభిమానం చూపించడం, ఇప్పుడు వైఎస్ జగన్ స్పందించడం ఇవన్నీ దీనికి సంకేతాలో..? ఎటు దారితీస్తాయి? అనేది చూడాలి మరి.