మాజీ మంత్రి, విశాఖపట్నంలో ఆర్థికంగా బలంగా ఉన్న అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామాకు సిద్ధమైనట్టు అవంతి అనుచరులు చెప్పుకుంటున్నారు. రాజీనామా లేఖను అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపిన అవంతి అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు.
కొన్నాళ్ళు దూరంగా..
రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కారణాల రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు. నేను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసిన ప్రతి ఇంటిని, టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదని అవంతి చెప్పుకొచ్చారు.
విశ్లేషణ చేసుకోండి!
రాజధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన అభివృద్ధి చేసిన ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయంలో నేనెలాంటి అవినీతి చేయలేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి,వారి ఆరు నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే, కార్యకర్తలు నేతలు ఇబ్బందిపడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారు అంతా వలంటీర్లు నడిపించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలు అందరిని ఒకసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం? అని వైఎస్ జగన్ రెడ్డిని అవంతి ప్రశ్నించారు
బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు
బ్రిటిష్ వారు నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయండి సమంజసం కాదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజం. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందింది.. మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. ఎమ్మెల్యేలు కావచ్చు సీఎంలు కావచ్చు ఎన్నికల ముందు ఒక ఆకాంక్షతో ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇబ్బందులు వస్తాయి. పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు కానీ ఉల్టా అయ్యింది. హైదరాబాద్ అంత డెవలప్ ఎందుకు అయిందంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అలా జరిగిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.
జనసేనలో చేరే అవకాశం!
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి.. తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరవాత టీడీపీలో చేరిన ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచి, పదవిలో ఉండగానే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తరవాత భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఐతే వైసీపీ ఓడిపోయిన ఆరు నెలలకే మళ్ళీ ఇక్కడ కూడా రాజీనామా చేశారు. ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అవంతికి కొత్తేమీ కాదు. నాడు టీడీపీని వీడటం, నేడు వైసీపీని వీడటం ఇందులో భాగమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర వ్యాపారాలు తెలుగు రాష్ట్రాల్లో అవంతికి చాలానే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక రాజీనామా చేయాల్సి వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. అవంతి మధ్య బేధాభిప్రాయాలు చాలా రోజులుగా ఉన్నాయి. ఈయన నాడు వైసీపీలో చేరడానికి కూడా ఇదొక కారణం అని చెబుతుంటారు. ఆ తర్వాత టీడీపీ కూటమి గెలిచాక మళ్ళీ పసుపు కండువా కప్పుకోవాలని అనుకున్నా అడ్డంకులు వచ్చి పడ్డాయి. దీంతో రాజకీయ అరంగేట్రం, గెలుపులో తనకు సహకరించిన కాబోయే మంత్రి నాగబాబు సహకారంతో జనసేన కండువా కప్పుకోవడని లైన్ క్లియర్ అయినట్టుగా తెలిసింది.