ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పంపకాల్లో మొదలైన జనసేన త్యాగాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, టీటీడీ చైర్మన్ పదవి, ఎమ్మెల్సీ ఇప్పుడు ఆఖరికి రాజ్యసభ సీటు కూడా త్యాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. దీంతో జనసేన కాస్త త్యాగలసేనగా మారిపోయిందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంతకీ మెగా బ్రదర్, జనసేనలో నంబర్ 2గా ఉన్న కొణిదెల నాగబాబుకు వచ్చిన బ్యాడ్ టైం ఏంటి..? ఎందుకు ఆయన త్యాగం చేయాల్సిన సమయం వచ్చిందనే విషయాలు ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి మరి.
అయ్యో.. బ్రదర్!!
నాగబాబు మళ్ళీ త్యాగానికి సిద్ధం కావాల్సి వచ్చిందనే మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అదిగో రాజ్యసభకు నాగబాబు.. ఇదిగో ఎంపీ అయ్యాడు అంటూ కార్యకర్తలు, వీరాభిమానులు, పార్టీల నేతలు తెగ సంబరపడిపోయారు. నాగబాబు కూడా తన తమ్ముడు మంచి పదవే ఇప్పిస్తున్నారని, ఇక ఢిల్లీ వేదికగా పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు చేయొచ్చని ఎంతో ఆశ పడ్డారు. ఐతే ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఎందుకంటే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వట్లేదని తెలిసింది. ఉన్న మూడు ఎంపీ స్థానాల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు అన్నది ఒప్పందం. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. సీఎం చంద్రబాబు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటకు అడ్డు చెప్పలేదు. ఐతే ఈ లోపు సమీకరణాలు మొత్తం మారిపోయాయి.
ఢిల్లీలో చక్రం తిప్పినా..!
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో నంబర్ 2గా ఉంటూ వస్తున్న నాగబాబు 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక నాటి నుంచి నేటి వరకూ పార్టీని బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి పదవి లేకపోయినా సరే పార్టీని ఓవైపు పవన్.. మరోవైపు నాగబాబు చూసుకున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించినా.. బీజేపీ కోసం త్యాగం చేయగా సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించే పనిలో పడితే.. ఇటు జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి ఆయన్ను మంచి పదవిలో కూర్చోబెట్టి, ఢిల్లీ వేదికగా చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు జరిపారని వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఐతే చక్రం తిరగలేదు.. ఆ చక్రం ఢిల్లీలోనే ఆగిపోయింది.. అది కూడా బీజేపీనే తీసేసుకుంది.
బీద, సానా, కృష్ణా..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ మూడింటిలో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి వెళ్తున్నాయి. జనసేనకు రావాల్సిన సీటును కమలం పార్టీ తన్నుకుపోయిందని తెలిసింది. టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్యను ఫిక్స్ చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే రాజీనామా చేసిన ముగ్గురిలో మళ్ళీ ఇద్దరు రాజ్యసభకు వెళ్తున్నారన్న మాట. ఇక కృష్ణయ్య రాజీనామా చేశారు కానీ అధికారికంగా బీజేపీలో చేరలేదు. ఒకటి రెండు రోజుల్లో కాషాయ కండువా కప్పుకుని.. ఆ తర్వాత అభ్యర్థిగా ఫిక్స్ చేస్తారని సమాచారం. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆది నుంచి త్యాగాలకు మారుపేరుగా.. త్యాగసేనగా పిలిపించుకున్న జనసేనకు మరోసారి అదే రీతిలో త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..? నాగబాబు పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు మరి.