వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎందుకో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అదేదో సామెత ఉంది కదా.. అచ్చం అలాజీ ఉంది పరిస్థితి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 రిలీజ్ అనౌన్స్ చేసింది మొదలుకుని ఇవాళ్టి వరకూ అస్సలు ఆగలేక నానా రచ్చ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేస్తున్న హడావుడి.. మీడియా ముఖంగా పుష్ప గురుంచి మాట్లాడుతున్న మాటలకు అసలు అంబటికి ఏమైంది..? బాగానే ఉన్నారా..? అని సొంత పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు ఆశ్చర్యపోయేలా డ్యూటీ చేస్తున్నారు.
ఎందుకనీ..?
ఎందుకో తెలియట్లేదు కానీ బన్నీని వైసీపీ నేతలు, కార్యకర్తలు గట్టిగానే మోసేస్తున్నారు. ఎంతలా అంటే వీరుడు, సూరుడు అంటూ రచ్చ రచ్చే చేస్తున్నారు. ఇందులో అంబటి రాంబాబు కూడా భాగం అయ్యారు. పుష్ప మూవీని ఎవరో ఆపుతున్నారని, ఎలా ఆపుతారో చూద్దామంటూ ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ మాటలు అటు ఆంధ్రా రాజకీయాల్లో.. ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప-2తెలుగు వారికి పేరు తేవాలి!.. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్ అంటూ రిలీజ్ ముందు వరకూ ట్విట్టర్ వేదికగా పోస్టుల వర్షం కురిపించారు. బహుశా నిర్మాతలు, డైరెక్టర్ కూడా ఇంతలా సినిమాను ప్రమోట్ చేసి ఉండరు..? అని చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..!
ఏ రకంగా మనవాడబ్బా?
పుష్ప సినిమా తొలిరోజు ఊహించని రీతిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో అంబటి మళ్ళీ లైన్ లోకి వచ్చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు 294 కోట్లు కలెక్ట్ చేసినవాడు మనవాడు కావడం, నాకు ఎంతో గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారు. ఇందులో మనవాడు అనే పదాన్ని బాగా హైలెట్ చేశారు. దీంతో కొందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే.. మరికొందరు గట్టిగానే ఆడుకుంటున్నారు. ఇంతకీ మనవాడు ఏ రకంగా అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. తెలుగోడు అని అర్థమా?, మన సామాజిక వర్గమే అని అర్థమా?, లేదంటే వైసీపీ పార్టీ వాడే అని అర్థమా..? ఇది అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అంబటి మాటలకు అర్థాలే వేరులే.. ఆయన మనసులో ఏముందో..? ఎందుకు ఇలా మాట్లాడారో రాంబాబుకే తెలియాలి మరి.