అవును.. మీరు వింటున్నది నిజమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరునామా మారబోతోంది. ఇప్పటి వరకూ కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేని అతిథి గృహంలో గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఐతే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం మొదలు కానుండటంతో ఇక్కడే ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాజధానిలో సొంతిల్లు నిర్మించుకుంటానని, ఈ ప్రాంతంలో ఇంటిస్థలం కూడా కొనుగోలు చేశారు.
ఎక్కడ.. ఏం సంగతి?
రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని చాలా రోజులుగా అన్వేషించిన చంద్రబాబు ఫ్యామిలీ.. అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిఇంటి స్థలం కొనుగోలు చేశారు. మొత్తం
25 వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉంది. ఈ భూమి ముగ్గురి రైతుల పేరిట ఉండగా, ఇప్పటికే ఆ రైతులకు డబ్బులు కూడా చెల్లించారు. ఇంటికి నాలుగు వైపులా రోడ్డు, అది కూడా సీడ్ యాక్సెస్ మార్గం కూడా పక్కనుండే వెళ్తుంది. ఈ ప్లాట్ ఉండే రెండు కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీవోల నివాస సముదాయాలతో పాటు పలు కీలక భవనాలు ఉన్నాయి.
కేరాఫ్ మారుతోందిగా..!
ఈ ఫ్లాట్ మొత్తం ఐదు ఎకరాలు. ఇందులోనే ఇల్లు, తోట, పార్కింగ్, సెక్యూరిటీకి సిబ్బందికి గదులు ఇంకా చాలా నిర్మాణాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ భూమిలో మట్టి పరీక్షలను అధికారులు మొదలుపెట్టారు. కరకట్ట ప్రాంతంలో ఉండే చంద్రబాబు చిరునామా ఇక వెలగపూడికి మారనుంది అన్న మాట. అంటే కరకట్ట చంద్రబాబు కేరాఫ్ వెలగపూడికి మారనుంది అన్న మాట. కాగా కరకట్ట ఇంటిపై నాడు అధికారంలో ఉన్నప్పటి నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదంతా అక్రమ కట్టడమే అని ఆరోపణలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, అమరావతి పనులు షురూ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇంటి పనులు మొదలయ్యాయి.