రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 7 గంటలకు పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. తెలంగాణ లోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాలలో భూప్రకంపనలు వణికించాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లంతా కదిలిపోతున్నట్టు అనిపిండచంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు కొంతమంది చెబుతున్నారు. కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం, ఇళ్లలో సామాన్లు పడిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భూ ప్రకంపనలు రావడమే కాదు, ఖమ్మం-ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అధికంగా కనిపించాయి.
హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలో జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.