అభిమానులు లేకపోతే మేము లేము అని చెప్పే హీరోలంతా అభిమానులను దోచుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఫ్యాన్స్ ఈ విషయంలో ఒప్పుకోరు కానీ.. రియాలిటీలోకి వస్తే స్టార్ హీరోలు నిజంగానే అభిమానులను బెన్ ఫిట్ షోస్ పేరిట అడ్డంగా దోచేస్తున్నారు. వీళ్ళు 200 కోట్లు, 100 కోట్లు పారితోషికాలు తీసుకుంటారు, కానీ అభిమానుల కోసం ఏదో ఫ్రీగా సినిమా చేసినట్లుగా బిల్డప్ ఇస్తారు.
అటు మేకర్స్ సినిమాలను అమ్ముకుని వాటిని క్యాష్ చేసుకోవడానికి, కలెక్షన్స్ తో మేడలు కట్టడానికి టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాల చుట్టూ తిరుగుతారు. వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకుని కలెక్షన్స్ వసూలు చేసుకుంటారు. ఆతర్వాత సినిమా ఆడినా ఆడకపోయినా ఓటీటీ లకు అమ్మేసుకుంటారు కాబట్టి అటు ఓటీటీ డీల్ తోనూ కోట్లు దోచుకుంటారు.
ఇక స్టార్ హీరోల సినిమాలను ప్రీమియర్స్ షోస్, బెన్ ఫిట్ షోస్ వేసి వాటికి టికెట్ ధర 3000 అన్నాసరే అభిమానులు వెర్రివాళ్ళు కాబట్టి అంత రేటు పెట్టి టికెట్ కొనేసి సినిమా చూసేస్తారు. ఆ విధంగా రికార్డ్ కలెక్షన్స్ ఓపెనింగ్ రోజే నమోదు అవుతాయి. భారీ బడ్జెట్ అంటూ సినిమాలు చెయ్యడం, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం, ఎమన్నా అంటే టికెట్ రేట్లు పెంచమనడం, ఇదెక్కడి న్యాయమో అనేది ఎవ్వరికి అర్ధం కావడం లేదు అంటున్నారు.
ప్రతి స్టార్ హీరో సినిమాకి జరిగేది ఇదే. అంత రేటు పెట్టి కొన్న అభిమానులు ఆకోపంతో సినిమా ఓ మాదిరిగా వున్నా బాగోలేదు అని ఇష్టం వచ్చినట్లు నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పడు వస్తున్న ఓ పెద్ద సినిమా విషయంలో ఈ టికెట్ ధరలు మరింతగా ఆకాశాన్ని అంటడం చూస్తుంటేనే చాలా మంది సోషల్ మీడియాలో టికెట్ రేట్ల గురించి డిస్కర్షన్ పెడుతున్నారు.